ఫలించిన సీఎం కేసీఆర్ ప్రయత్నం..కర్ణాటక నుంచి తెలంగాణకు నీటి విడుదల

179
KCR_kumara-swamy

కర్ణాటక నుంచి జురాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ వాసుల దాహర్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఫలితం లభించింది. కర్ణాటక నుంచి జురాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఇటీవలే కర్ణాటక సీఎం ను కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జూరాలపై ఆధారపడ్డ పాలమూరు గ్రామాలకు తాగునీటిని అందించాలని తెలిపారు.

దీంతో తాజాగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నాడు ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆల్మట్టి నుంచి విడుదల అయిన నీరు 60 కిలోమీటర్లు ప్రయాణించి నారాయణపూర్ కు, ఆపై 180 కిలోమీటర్లు ప్రయాణించి జూరాలకు చేరాల్సివుంటుంది.

కర్ణాటక నుంచి తెలంగాణకు నీరు రావడానికి ఐదు నుంచి ఆరు రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉంది. ఈనీరు జురాలకు వస్తే ఈవేసవిలో పాలమూరు జిల్లా వాసులకు మంచి నీటి కొరత ఉండదని చెబుతున్నారు అధికారులు. ఇక జురాలకు నీటి విడుదలపై పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.