ప్రస్తుతం అందరి చూపు కర్నాటక ఎన్నికలపై పడింది. ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈసారి కర్నాటకలో సత్తా చాటే పార్టీ ఏది అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మూడు కూడా అధికారం తమదే అని ధీమాతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వేలు వెల్లడిస్తున్న ఫలితాలు మాత్రం ఈసారి హంగ్ ఏర్పడడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి. దీంతో ఏ పార్టీది పై చేయిగా ఉండబోతుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అయితే లోక్ పోల్ వంటి మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. .
అయితే దాదాపు కర్నాటక ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. అయితే ఇదే ప్రజాతీర్పు అని భావించడానికి లేదు. కాగా ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శించబోతుంది అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ జోరుగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించేందుకు 113-119 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని సీట్లను ఏపార్టీ కైవసం చేసుకొని పక్షంలో హంగ్ ఏర్పడడం ఖాయం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు స్పస్తమైన ఆధిక్యం ప్రదర్శించని పక్షంలో జేడీ( ఎస్ ) పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.
జేడీఎస్ మద్దతు ఉన్న పార్టీనే అధికారం చేపట్టగలదు. కాగా జేడీఎస్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఏంఐఏం పార్టీ జేడీఎస్ తో పొత్తుకు సిద్దం అని స్పష్టం చేసింది. అలాగే బిఆర్‌ఎస్ కూడా జేడీఎస్ కు మద్దతు తెలిపే అవకాశం ఉందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఆయా పార్టీల మద్దతు కూడా జేడీఎస్ కు మెండుగా ఉంది. దీంతో బీజేపీ కాంగ్రెస్ లకు జేడీఎస్ షాక్ ఇచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన. మరి కన్నడికులు తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…