‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ..

524

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం​ ‘శ్రీదేవి సోడా సెంటర్’. అమలాపురం బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాకు ‘పలాస 1978’ డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఎలక్ట్రీషియన్‌ సూరిబాబుగా నటించిన హీరో తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ సినిమా మంచి అంచనాలతో ఈ రోజే విడుదలైంది.. మరి ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: సూరిబాబు (సుధీర్ బాబు) గోదావరి ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే కుర్రాడు. అతను ఒక జాతరలో శ్రీదేవి (ఆనంది) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు శ్రీదేవి కూడా అతణ్ని ప్రేమిస్తుంది. కానీ వేరే కులానికి చెందిన సూరిబాబుతో శ్రీదేవి పెళ్లి చేయడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టముండదు. ఇదిలా ఉంటే సూరిబాబు అనుకోకుండా ఒక హత్య కేసులో చిక్కుకుని జైలు పాలవుతాడు. దీంతో అతడికి శ్రీదేవి దూరమవుతుంది. ఇక్కడి నుంచి సూరి.. శ్రీదేవిల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి.. చివరికి ఏమైందన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్‌:సూరిబాబుగా సుధీర్‌బాబు చక్కటి నటనను కనబరిచాడు. ఎలక్ట్రీషియన్‌ పాత్రకు తగినట్లుగా తన హావభావాల్ని, బాడీలాంగ్వేజ్‌, యాసను మార్చుకుంటూ నటించారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో మాదిరిగా యాక్షన్‌ ఘట్టాలతో కాకుండా ఎమోషనల్‌గా దర్శకుడు తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచనను రేకెత్తిస్తాయి. స్క్రీన్‌ప్లేతో విభిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.

మైనస్ పాయింట్స: ఈ కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచింది. ప్రస్తుత కాలంలో నడిచే కథ అయినప్పటికీ.. చాలా ఏళ్ల కిందటి ‘పాత’ సినిమాలో కనిపించడం ‘శ్రీదేవి సోడా సెంటర్’లో కనిపించే అతి పెద్ద లోపం. కథ.. కథనం.. సన్నివేశాలు.. ఇలా ఎందులోనూ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘పలాస’తో మెప్పించిన కరుణ్ కుమార్.. ఈసారి కేవలం చివర్లో వచ్చే హార్డ్ హిట్టింగ్ ట్విస్టును నమ్ముకుని మిగతా అంతా రొటీన్ సన్నివేశాలతో నింపేయడం నిరాశకు గురి చేస్తుంది.

సాంకేతిక విభాగం: మణిశర్మ పాటల్లో చుక్కల మేళం ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు పర్వాలేదు. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం సినిమాలో మరో మేజర్ హైలైట్. విజువల్స్ సినిమాకు ఒక రస్టిక్ లుక్ తీసుకొచ్చాయి. నిర్మాణ విలువల విషయంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు ఏమాత్రం రాజీ పడలేదు. కథను నమ్మి బాగా ఖర్చు పెట్టారు. సాంకేతికంగా అన్ని విషయాలూ ఉన్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకున్నారు.

తీర్పు: రెగ్యులర్‌ లవ్‌స్టోరీకి భిన్నంగా సాగే చిత్రమిది. కమర్షియల్‌ హంగుల జోలికి పోకుండా తాము చెప్పాలనుకున్న కథను దర్శకనిర్మాతలు నిజాయితీగా తెరపై ఆవిష్కరించారు. శ్రీదేవి సోడా సెంటర్ కథ పాతదే అయినా సినిమాలో కొత్త ముగింపును చూపించారు.

విడుదల తేదీ: 27/08/2021
రేటింగ్-2.5/5
నటీనటులు: సుధీర్ బాబు-ఆనంది
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డి
దర్శకత్వం: కరుణ్ కుమార్