మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష.. కీలక సూచనలు..

135
sec
- Advertisement -

ఈనెల 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చెర్ల, కొత్తూర్ మరియు నకరేకల్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు మరియు నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్పల్లి, ఆలంపూర్, జల్పల్లి మరియు గజ్వేల్ మున్సిపాలిటీలలోని ఒక్కొక్క వార్డుకు నిర్వహించబోతున్న ఆకస్మిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా కోవిడ్-19 నిబంధనలను హైకోర్ట్ ఉత్తర్వులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి సూచించారు.

ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయం నుండి ఎన్నికలు జరుగనున్న జిల్లాల కల్లెక్టర్లు, పోలీస్ కమీషనర్లు/ఎస్.పి లు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు, మునిసిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల అధికారి మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యదర్శి అశోక్ కుమార్, ఓఎస్డి జయసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలింగ్ మరియు కౌంటింగ్ రోజులకు సంబంధించి పాటించవలసిన కోవిడ్-19 నిబంధనలపై ఎస్ఈసీ పలు సూచనలు చేసారు.

-పోలింగ్ మరియు కౌంటింగ్ రోజులలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
-అన్ని పోలింగ్ కేంద్రాల పరిసరాలను ముందు రోజు, పోలింగ్ రోజు శానిటైజ్ చేయాలి.
-పోలింగ్ కేంద్రం లోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరు ప్రవేశించే ముందు, బయటికి వెళ్ళే ముందు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. దీనిని అమలు పరిచేందుకు ఒక బాధ్యతాయుతమైన ఇంచార్జ్ ను నియమించి, అవసరమైన శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి.
-భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్క్ చేయాలి. వోటర్లు భౌతిక దూరం పాటించేలా పర్యవేక్షణకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ను నియమించాలి.
-పోలింగ్ కేంద్రం లోపల వుండే పోలింగ్ సిబ్బంది మరియు పోలింగ్ ఏజెంట్ల సీటింగ్ భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలి.
-పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది, పోలీస్ సిబ్బంది విధిగా మాస్క్ లు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు ధరించాలి. వీలును బట్టి ఎన్-95 మాస్క్ లేదా రెండు మాస్కులు ధరించాలి. ఎవరైనా సిబ్బంది అనారోగ్యంగా ఉన్నట్లయితే పోలింగ్ విధులు కేటాయించరాదు.
-పోలింగ్ మరియు పోలీస్ సిబ్బందిని తరలించడానికి అవసరమైనన్ని వాహనాలను ముందుగానే సమకుర్చాలి. వాహనం సీటింగ్ కెపాసిటీలో 50% మాత్రమే అనుమతించాలి.
-కోవిడ్-19 నిబంధనల అమలు, పర్యవేక్షణ కొరకు ప్రతి మునిసిపాలిటీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్ నోడల్ అధికారులను నియమించాలి.
-ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది అవసరమైన మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలి.
-పోలింగ్ కేంద్రం ఆవరణలో పెద్ద షామియానా లను ఏర్పాటు చేసి అందులో భౌతిక దూరం పాటించేలా వోటర్లకు కుర్చీలు ఏర్పాటు చేయాలి.
-ప్రతి రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అవసరమైన అంబులెన్సు లను ఆక్సిజెన్ సిలిండర్ లతో సిద్దంగా ఉంచాలి.
-రిసెప్షన్ సెంటర్ల వద్ద అవసరమైనన్ని ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒకే సమయంలో 10 మందికి మించకుండా ఉండేలా చూడాలి. అందుకు అనుగుణంగా పోలింగ్ టీమ్ లకు ముందుగా సమయం కేటాయించాలి.
-డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద అవసరమైనన్ని శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి.
-పోలింగ్ సిబ్బందికి రిసెప్షన్ సెంటర్ నుండి వారి గమ్య స్థానాలకు రవాణా సౌకర్యం కల్పించాలి.
-పోలీస్ మరియు పోలింగ్ సిబ్బందికి 29, 30 మరియు కౌంటింగ్ సిబ్బందికి ౩ వ తేదీలలో పరిశుభ్రమైన సురక్షిత ఆహారం, రక్షిత త్రాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలి.
-పోలింగ్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల వద్ద కోవిడ్-19 నిబంధనలపై అవగాహన కల్పించే పోస్టర్లను సిబ్బందికి, వోటర్లకు కనిపించేలా ఏర్పాటు చేయాలి.
పోలింగ్ రోజున, కౌంటింగ్ రోజున గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలి, నలుగురికంటే ఎక్కువ మంది ఒక్క చోట చేరకుండా చుఉడాలి. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలి.
-స్ట్రాంగ్ రూమ్ లు విశాలమైన గదులలో ఏర్పాటు చేసి ముందుగా శానిటైజ్ చేయాలి. అలాగే పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలి.
-కౌంటింగ్ హాల్స్ విశాలమైన గదులలో ఏర్పాటు చేసి ఒక్కో గదిలో ఐదు కు మించకుండా టేబుల్స్ ఏర్పాటు చేయాలి. ఏ సమయంలో నైనా ఒక్క కౌంటింగ్ హాల్ లో 50 మందికి మించి ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
-కౌంటింగ్ హాల్స్ లో కౌంటింగ్ ఏజెంట్లకు బౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ పూర్థి అయ్యేవరకు మాస్కులు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు శుభ్రపరచు కునేలా చూడాలి.
-జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న ఏ ఒక్కరిని కౌంటింగ్ హాల్ లోనికి అనుమతించరాదు.
-కౌంటింగ్ సిబ్బంది విధిగా మాస్క్ లు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు ధరించాలి, ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి.
-అవసరమైన వారికి పిపిఈ కిట్లు అందించాలి, కౌంటింగ్ సెంటర్లను కౌంటింగ్ కు ముందు, తరువాత కూడా శుభ్రపరచాలి.
-ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారాదు.
-ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కోవిడ్-19 నిబంధనలు పాటించాలి.
-రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నికైన ధృవపత్రం అందుకోవడానికి అభ్యర్థితో పాటు మరొకరిని మాత్రమే అనుమతించాలి.
-పోలింగ్ మరియు కౌంటింగ్ సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

- Advertisement -