ఇప్పటికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్దమౌతోంది. 4జీ సామర్థ్యంతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్స్ వేస్తోంది. కొత్త కేటగిరీ ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫీచర్ ఫోన్ల లాంచింగ్ ఎంతో సహకరిస్తుందని ఈ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త తరం డివైజ్‌ల ధర కూడా చాలా చౌకగా రూ.1000 నుండి రూ.1500ల మధ్య ఉండనుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు రూ.3500కు బేసిక్ 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను యూజర్లకు అందించిన జియో ఇకపై రూ.1500 కే ఆ ఫోన్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జియో తీసుకురానున్న రూ.1500 4జీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్‌నే అందించనున్నారు. కానీ వాటిని స్మార్ట్‌ఫోన్ రూపంలో కాకుండా ఫీచర్ ఫోన్ రూపంలో తయారు చేయనున్నారు. అంటే ఆ ఫోన్లకు టచ్ ఉండదు. అందుకు బదులుగా కీ ప్యాడ్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆ ఫోన్‌లో 4జీ వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడుకోవచ్చు. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ పనిచేసినట్టే ఆ ఫోన్ కూడా పనిచేస్తుంది. వోల్టా ఫీచర్ కోసం ప్రత్యేకమైన చిప్‌లను ఫోన్లను అమర్చనుంది. ఇందుకోసం ప్రాసెసర్లను తయారు చేసే స్ప్రెడ్‌ట్రమ్, క్వాల్‌కామ్, మీడియాటెక్ వంటి కంపెనీలతో రిలయన్స్ జియో జట్టు కట్టినట్టు సమాచారం.
కాగా, భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్ల సంఖ్య దాదాపుగా 39 కోట్లు ఉన్నట్టు అంచనా. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉండగా, రూ.1500 కే 4జీ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని యూజర్లు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ అది వస్తే మాత్రం స్మార్ట్‌ఫోన్ల రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.