అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్దమౌతోంది. 4జీ సామర్థ్యంతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో ప్రారంభించబోయే ఈ ఫోన్‌ను రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. గ్రామీణ భారతావనిలోని ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు. 2జీ మొబైల్ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్ ఫోన్ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ ఫీచర్ ఫోన్‌ను రూ. 500 కే అందించనున్నట్టు బ్రోకరేజ్ హెచ్ఎస్‌బీసీ అంచనా వేస్తోంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్11 న ప్రకటించిన 84 రోజుల ధన్ ధనాధన్ ఆఫర్ త్వరలో ముగియనున్నసంగతి తెలిసిందే. త్వరలో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది.
ఈ ఫోన్ లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి. వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సదుపాయాలుంటాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే, అతి తక్కువ ధరకు కాల్స్ చేసుకోవచ్చు. అన్ని జియో యాప్స్, 4జీ సిమ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇక మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ తదితరాలకు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి.
4జీ మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్స్ విభాగంలో ఇప్పటికే 10 కోట్ల మార్కును క్రాస్ చేసిన జియో, బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టబోతోంది. జియో ఫైబర్ సర్వీసులకు సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ ప్రాసెస్ ఇప్పటికే కొన్ని చోట్ల జరుగుతోంది. జియో చేరువచేసే ఫైబర్ సర్వీసులో భాగంగా ఇటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు అటు డీటీహెచ్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.