అంజనీపుత్ర క్రిష్‌కి నమస్కారం..నేను మీ రాజమౌళి

91
Rajamouli

చారిత్రాత్మక,,సోషియో ఫాంటసీ చిత్రాలు తీయాలంటే చాలా టైం పడుతుంది. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను అందరు ఆశ్చర్యపోయేలా కేవలం 79 రోజుల్లోనే చిత్రీకరించి ప్రేక్షకుల హృదయాలను చురకొన్నాడు. తక్కువ సమయంలో అద్బుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టేలా తీర్చిదిద్దాడు. దర్శకులందరిచేత శభాస్ అనిపించుకున్నాడు. అయితే క్రిష్ కు ఓ డైరెక్టర్ నుంచి మాత్రం ప్రత్యేకమైన అభినందన అందుకున్నాడు. ఆయనే రాజమౌళి. క్రిష్‌ కు ట్విట్టర్ ద్వారా అభినందన తెలియజేసినా..ఇంకాస్త వివరంగా లేఖ రూపంలో చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందాయనకు. వెంటనే.. కలం పట్టుకొన్నారు.

అంజనీపుత్ర క్రిష్‌కి నమస్కారం…
మీ ‘గౌతమి పుత్రు’ణ్ని చూశా! చూసినప్పటి నుంచీ మీతో ఏదో చెప్పాలని… మీతో చాలా చాలా పంచుకోవాలని అనిపించింది. మీరు కలిసినప్పుడే చెబుదామనుకొంటే… ‘శాతకర్ణి..’ విజయోత్సవంలో బిజీగా ఉన్నారు. పైగా సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడిగా అత్తారింటికి వెళ్లారు… ఇప్పుడు అమెరికాలో ఫ్యాన్స్‌తో పండగ చేసుకొంటున్నారు. వీలు చూసుకొని… తీరిగ్గా చదువుకొంటారని మీ శైలిలోనే ఓ ఉత్తరం రాస్తున్నా.

Rajamouli

ఏమాటకామాట చెప్పుకోవాలి. ‘క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణగారి వందో సినిమా’ అంటే నిజంగా నమ్మలేదు. ఉత్తిపుణ్యానికి పుట్టుకొచ్చే చాలా వార్తల్లో ఇదీ ఒకటి అనుకొన్నా. ఎందుకంటే మీ సెన్సిబులిటీస్‌ నాకు తెలుసు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’.. ఇవన్నీ జీవితాల్లోంచి పుట్టిన కథలు. మరోవైపు బాలయ్య జోరూ చూశా. ఆయనవన్నీ లార్జన్‌ ద్యాన్‌ లైఫ్‌ అనిపించే సినిమాలు. ‘ఈ రెంటికీ పొంతన ఎక్కడ కుదురుతుందిలే’ అనిపించింది. ఆ తరవాత నిజంగానే మీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోందని తెలిసింది. తొలిసారి ఆశ్చర్యపోయా. బాలకృష్ణగారి ఇమేజ్‌కీ, క్రిష్‌ సున్నితత్వానికీ సరిపడదే… అని నా మనసు తొలిచేసింది.

కొత్త కాంబినేషన్‌ అని కొంతమంది… వింత కాంబినేషన్‌ అని కొంతమంది. బ్యాడ్‌ కాంబినేషన్‌ అని నాతో పాటు చాలామంది… ఇలా ఎవరి భ్రమల్లో వాళ్లున్నాం. పైగా చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. అసలీ శాతకర్ణి గురించి చరిత్రలో ఎంతమందికి తెలుసు? ఆ మాటకొస్తే నాకూ కొంతే తెలుసు. పాఠ్యాంశాల్లో నాలుగంటే నాలుగులైన్లు… నాసిక్‌లో ఓ శాసనం. మళ్లీ ఆశ్చర్యపోయా.

కథ ఎక్కడ నుంచి తెస్తారు? ఎన్నాళ్లని పరిశోధిస్తారు? దానికే యేడాది పడుతుందేమో అని లెక్కలేశా. సరే… శోధిస్తారు, సాధిస్తారు అనుకొందాం. తెలియని చక్రవర్తి చరిత్రని ప్రేక్షకులు ఏమంత ఆదరిస్తారు. ఇక ఈ సినిమా అయినట్టే. ఇలా అనుకొంటుండగానే షూటింగ్‌కి వెళ్లారని తెలిసింది. మళ్లీ మళ్లీ అదే ఆశ్చర్యం!

మొరాకో అన్నారు… జార్జియా అన్నారు… మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరమన్నారు.. ఇలా మొదలెట్టారో లేదో అప్పుడే అయిపోయిందని వార్త విన్నా. ఈసారి ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేసింది. ప్రారంభించిన 79 రోజుల్లోనే గుమ్మడి కాయ కొట్టడమేంటి? నాకు నమ్మబుద్ధి కాలేదు. అసలు వీళ్లేం రాశారూ… వీళ్లేం తీశారు… అని ఈసారి ఇంకా గట్టిగా అనిపించింది. పైగా మొదటి శతాబ్దపు యుద్ధ కథ అని విన్నాను. షూటింగ్‌ ఎలా ప్లాన్‌ చేశారు..? ఎవరు డిజైన్‌ చేశారు..? సెట్స్‌ ఎక్కడ వేశారు? ఒక యుద్ధం ఎన్ని రోజుల్లో తీశారు..? ఇంత తక్కువ సమయంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా పూర్తి చేసి ఎలా రిలీజ్‌ చేశారు? ఇలా అన్నీ అనుమానాలే.

మధ్యలో ఓసారి సాయి కొర్రపాటి గారు మాటల సందర్భంలో ‘గౌతమిపుత్ర..’ చాలా బాగా వచ్చిందట… హిట్‌ అవుతుందట…’ అన్నారు.
12వ తారీఖు… తెల్లవారుజామున ఫ్యాన్స్‌తో పాటు నేనూ సినిమా చూశా. అప్పటి వరకూ ఉన్న ఆశ్చర్యాలు, అనుమానాలూ అద్భుతాలుగా మారాయి. రెండు గంటల పాటు మొదటి శతాబ్దంలోకి వెళ్లొచ్చిన భావన. అక్కడుంది నాకు తెలిసిన బాలయ్య కాదు… సాక్షాత్తూ శకపురుఫుడు సార్వభౌమ శాతకర్ణి. ‘సమయం లేదు మిత్రమా..’ అని చెప్పినప్పుడల్లా సగటు అభిమానిలానే నా గుండె కూడా పులకరించింది. యుద్ధరంగంలో బాలయ్య గుర్రం మీద కూర్చుని పిల్లాడు చెప్పిన కథ వింటాడు చూడండి… హీరోయిజం నాకు ఇంకో కోణంలో కనిపించింది.

చరిత్ర అంటే డాక్యుమెంటరీలా తీస్తారనుకొంటే… మీరు దాన్ని అచ్చమైన కమర్షియల్‌ చిత్రంగా మలిచారు. నాలాంటి ఎంతోమంది హృదయాల్ని గెలిచారు. ప్రతీ మాటా… ప్రతీ సన్నివేశం, ప్రతీ మలుపూ కదిలించింది. తెలుగువాడిగా మీసం మెలేయాలనిపించేలా చేసింది. యుద్ధంలో హింస, రక్తపాతం ఉంటాయి. కానీ మీ యుద్ధంలో భావోద్వేగాలు కనిపించాయి. భావోద్వేగాలతో సాగే సన్నివేశాలూ యుద్ధంలానే ఉన్నాయి. కావ్యాల్లాంటి దృశ్యాలన్నీ కలిసిన దృశ్యకావ్యం. ఈ సినిమా కథ చరిత్ర… ఈ సినిమా తీసిన విధానం ఒక చరిత్ర.. ఈ సినిమా తీయాలన్న ఆలోచన రావడమే ఓ చరిత్ర. మా భ్రమల్ని పటాపంచలు చేసిన మీకూ.. మీతో పాటు ఓ సైన్యంలా పనిచేసిన చిత్రబృందానికీ, మరీ ముఖ్యంగా వందో చిత్రం కోసం ఇంత గొప్ప కథని ఎంచుకొన్న బసవరామ తారక పుత్ర బాలకృష్ణగారినీ మనసారా అభినందిస్తూ..సాహో.. గౌతమిపుత్ర శాతకర్ణి..’’