తెలంగాణలో నాణ్య‌మైన విద్య‌

268
tlasani srinivas yadav
- Advertisement -

టీన్యూస్, అపెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ నేటితో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్ధులు చదువుకోవడానికి అనువైన అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకుని మంచి కళాశాలలను ఎన్నుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారిని మంచి కాలేజీల్లో చేర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ సూచించారు.

విద్యార్థుల సందేహాలను తీర్చడానికి టీన్యూస్, అపెక్స్ సంస్ధ‌లు విద్యార్ధుల‌కు, త‌ల్లి తండ్రుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించాయ‌న్నారు. ఇంట‌ర్మీడియ‌ల్ అయిపోయిన త‌ర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కాలేజిని ఎంచుకొవాల‌ని తెలుసుకోవ‌డానికి ఇది సదావ‌కాశమని అన్నారు. పిల్లల ప‌ట్ల త‌ల్లితండ్రులు చాలా కేర్ తీసుకోవాల‌న్నారు. మంచి కాలేజిలో చేర్పించడ‌మే కాకుండా వారి ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా గ‌మ‌నించాల‌న్నారు. వారం రోజుల‌కు ఒక‌సారి త‌ల్లి తండ్రులు కాలేజికి వెళ్లి పిల్లల చ‌దువుల‌పై శ్ర‌ద్ద తీసుకొవాల‌న్నారు. క‌ళాశాల‌లో ఉన్నంత‌సేపు ఉపాధ్యాయులు వారిని చూసుకుంటారని, కాలేజి అయిపోగానే పిల్లలు ఎటు వెళ్తున్నారని గ‌మ‌నించాల్సిన బాధ్య‌త త‌ల్లితండ్రుల‌పై ఉంద‌న్నారు.

రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో  ఇప్పటికే  ఎన్నో విప్లవాత్మకమైన  మార్పులు తీసుకొచ్చారని, విద్యారంగంలో లోపాలపై  కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, సరైన రీతిలో లేని చాలా కళాశాలలను మూసివేయించారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవతో చాలా కాలేజీలు తమ కళాశాలల్లో మౌళిక వసతులు, ల్యాబ్స్, ఫ్యాకల్టీ ఫెసిలిటీలను మెగురుపర్చాయని అన్నారు.

ప్ర‌భుత్వ‌ పాఠశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డమే కాకుండా వారికి పౌష్టికంగా ఆహారం పెట్టాల‌నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ విద్యార్దుల‌కు స‌న్న బియ్యం తో అన్నం పెడుతున్నార‌న్నారు. గ్రామాల్లో కూడా విద్యార్దుల‌ను ప‌టిష్టంగా త‌యారుచేయ‌డానికి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కూడా ఇంగ్లీష్ మీడియంను ఏర్పాటు చేశామ‌న్నారు. విద్యార్దుల చ‌దువు ముగిస‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వారికి ఉద్యోగాల క‌ల్ప‌న‌లో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌న్నారు. ఈకార్య‌క్ర‌మం నిర్వ‌హించిన టీన్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మ‌రియు అపెక్స్ సంస్ధ‌కు మంత్రి త‌ల‌సాని ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి, వివిధ కళాశాలల ఉపాధ్యాయుల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

- Advertisement -