రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధించాలి- ప్రధాని మోదీ

33
modi

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. రెండో వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై ఆరా తీశారు. కరోనా కట్టడి నిబంధనల్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని సూచించారు. మహమ్మారిని అదుపు చేయాలంటే మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, విస్తృత నిర్ధారణ పరీక్షలే మార్గమని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ చేసిన పలు సూచనలు…

-మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, రాత్రి కర్ఫ్యూలపైనే మన దృష్టంతా ఉండాలి. కొవిడ్‌ కర్ఫ్యూలుగా పేర్కొంటున్న రాత్రి కర్ఫ్యూల వల్ల ప్రజలు మహమ్మారిపై అప్రమత్తంగా ఉంటారు.

-నిర్ధారణ పరీక్షల్ని వేగవంతం చేయండి. లక్షణాలు లేని బాధితుల్ని గుర్తించడం చాలా ముఖ్యం. లక్షణాలు లేని వారివల్లే వారి కుటుంబ సభ్యులందరికీ వైరస్‌ సోకుతోంది. నిర్ధారణ పరీక్షల్లో 70 ఆర్‌టీపీసీర్‌ ఉండేలా చూడండి. నమూనాల్ని సరిగా సేకరించేలా జాగ్రత్తలు తీసుకోండి.

-పాజిటివిటీ రేటును ఐదు శాతం దిగువకు తీసుకురావాలి. మరణాల శాతాన్ని తగ్గించాలి. మరణాలపై సమగ్ర సమాచారాన్ని అన్ని పోర్టల్లల్లో తాజాపరచాలి.

-కరోనా టీకాలు వ్యర్థం కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హులకు వీలైనంత త్వరగా టీకా అందజేయాలి. ఏప్రిల్‌ 11 నుంచి 14 మధ్య ‘టీకా ఉత్సవ్‌’ నిర్వహిద్దాం. ఈ సందర్బంగా వీలైనంత ఎక్కువ మంది అర్హులకు టీకా అందజేద్దాం.

-నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి. గవర్నర్లను కూడా అందులో కలుపుకోవాలి. ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.