లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు- ప్రధాని మోదీ

38
pm modi

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడున్నర లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ కేబినెట్ స‌మావేశం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని చర్చించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టే ఆలోచనలో కేంద్రం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని మోడీ సూచించారు.

క‌రోనా మ‌హ‌మ్మారిని వందేళ్లకోసారి వ‌చ్చే సంక్షోభంగా ప్రధాని అభివ‌ర్ణించారు. క‌రోనా ప్ర‌పంచానికి పెను స‌వాలునే విసిరింద‌ని, దానిని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఇప్ప‌టికే మూడు వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌గా.. మ‌రికొన్ని వ్యాక్సిన్లు వివిధ ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో త‌యార‌వుతున్న రెండు వ్యాక్సిన్ల 15 కోట్ల డోసుల‌ను వేసిన‌ట్లు తెలిపారు.

మంత్రులంద‌రూ త‌మ త‌మ ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడూ ట‌చ్‌లో ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ సూచించారు. స్థానికంగా ఉన్న స‌మస్యలను వెంట‌నే గుర్తించి, ప‌రిష్క‌రించాల‌ని కూడా ఆయ‌న మంత్రుల‌ను ఆదేశించారు. దేశంలో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సంబంధించి మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుప‌ర‌చ‌డం, హాస్పిట‌ల్స్ బెడ్స్‌ను పెంచ‌డం, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, ఉత్ప‌త్తిని పెంచ‌డం వంటి అంశాల‌పై కూడా చ‌ర్చించారు.