నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. పవన్‌ హెచ్చరిక..

203
- Advertisement -

శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసిన ఆయన అనంతరం బాలాజీపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘ఏపీలో ప్రజాస్వామ్యంగా పనులు జరగడం లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని పవన్‌ తెలిపారు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. వంగేది లేదు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు పవన్‌. రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.

శ్రమదానం చేయడం తనకు సరదా ఏమీ కాదని, రాజకీయం చాలా కష్టమైన ప్రక్రియ అని పవన్ కల్యాణ్ అన్నారు. ’నిలబడటానికి నేను ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు? ఒడిదుడుకులు, ఓటములు అధిగమించి నిలబడటానికే వచ్చా‘ అని ప్రకటించారు. ప్రజలు కట్టే పన్నులన్నీ ప్రభుత్వం వద్దకు వెళ్తాయని, ఆ డబ్బుతో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. పచ్చి బూతులు తిట్టగానే తాను బెదిరిపోనని చెప్పిన పవన్.. ’నా గురించే ఆలోచిస్తే తిట్టిన వాళ్లను కింద కూర్చోబెట్టి నార తీసేవాడిని. ప్రజల కోసమే తిట్లు తింటున్నా. ఇంతకాలం ఎన్నో మానసిక అత్యాచారాలు భరించా, ఎన్నో మాటలు పడ్డా. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు‘ అని ప్రత్యర్థులను పవన్‌ హెచ్చరించారు.

సీఎం అంటూ అభిమానులు అరవడంతో దానికి కూడా పవన్ బదులిచ్చారు. ’పవన్ వస్తేనే పవర్ స్టార్ అనండి, సీఎం అయ్యాకే సీఎం అని పిలవడం. ఇప్పుడు జనసేనాని అనండి‘ అని అభిమానులకు చెప్పారు. తాము బాధ్యతగా ఉంటామని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అలాగే బాధ్యతగా ఉండాలని పోలీసులు, అధికారులు చెప్పాలన్నారు. ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం ఎవరికీ ఉండదని, కానీ ఎలా ప్రవర్తించాలన్నది మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఎవరో ఒకరు ఏదో అన్నారని ఒక కులాన్ని నిందించకూడదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదన్నారు. కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర పెత్తనం మొత్తం రెండు ఇళ్లకే పరిమితం అంటే కుదరదని, ప్రజాస్వామ్యంలో అణిచివేత మంచిది కాదని పవన్ పేర్కొన్నారు.

- Advertisement -