నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్

245
Nandi Awards Controversy

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా ప్రకటించిన నంది అవార్డుల ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, మిగిలిన వారిని చిన్నచూపు చూశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్ళుగా అవార్డులు ప్రకటించలేదు అనుకుంటున్న సినీ పరిశ్రమ ప్రభుత్వం అవార్డులు ప్రకటించటం పై హర్షం వ్యక్తం చేస్తుండగా అదే సినీ పరిశ్రమకి చెందిన ఒక వర్గం నంది అవార్డుల పై బహిరంగంగా విమర్శలు చేయటం ఇండస్ట్రీ లో కలకలం రేపింది

నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.  మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు.  చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని… అయినప్పటికీ, ఆవేదనను తట్టుకోలేక తాను ప్రశ్నిస్తున్నానని తెలిపాడు.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ తీరు సరిగా లేదంటూ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇవి నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది. నాడు ‘మగధీర’ సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రుద్రమదేవి లాంటి  సినిమా తీసినందుకు నన్ను క్షమించండి అంటూ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దర్శకుడు మారుతి సైతం నంది అవార్డులపై నిరసన గళం విప్పారు.  నటుడు ఉత్తేజ్‌ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్‌) ‘ఒరేయ్‌! ఈ అవార్డ్స్‌ మన కోసం ఎరేంజ్‌ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్‌కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్‌గా మారుతి పోస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.