స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పథకాలను కానుకగా అందించబోతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పంద్రాగస్టు రోజున మరో మూడు పథకాలకు అందుబాటులోకి తేనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే విధంగా రైతుకు వెన్ను దన్నుగా నిలవడానికి రైతు భీమా పథకాన్ని కూడా ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి అండగా ఉండి వారికి ఆర్ధిక సాయం చేయడానికి, బీసీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పించడానికి బీసీలకు రుణాల అందజేత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి నల్లా నీరును అందించే మిషన్ భగీరథ పథకాన్ని కూడా ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు పరిశుద్ధ గ్రామాలే లక్ష్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఇదే రోజున ప్రారంభించనున్నారు.