మరో రెండు రోజులు వర్షాలే…

234
rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గత రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తర ఒడిశా తీరం పరిసరాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది మరింత ఎత్తునకు వెళ్లి దక్షిణ నైరుతి దిశగా కదిలే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో రాగల 24 గంటలలో వాయవ్య బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.

Godavari_river

ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో భారీ నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు అధికారులను అప్రమత్తం చేశారు. చెరువులు, కుంటల్లో భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో కట్టలు తెగే ప్రమాదం ఉందని, ఎటువంటి సమస్య వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు.

- Advertisement -