మహిళల రక్షణలో రాజీపడం: ఎమ్మెల్సీ కవిత

160
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పుర్రె మమత హత్య కేసులో నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇదే విషయంపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిందితులను పట్టుకోవాలని కోరారు. మమత హత్య కేసు దర్యాప్తును స్థానిక ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ సైతం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఆదివారం,యాదవ సంఘం ప్రతినిధులు, గ్రామస్థులు మమత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిసి, పుర్రె మమత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వెంటనే నిజామాబాద్ సీపీ కార్తికేయకు ఫోన్ చేసిన ఎమ్మెల్సీ కవిత, విచారణలో ఆలస్యానికి గల కారణాలపై చర్చించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడేది లేదన్న ఎమ్మెల్సీ కవిత, మమత హత్య కేసు దర్యాప్తులో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీపీ కార్తికేయను కోరారు.

మహిళలపై నేరాలను సీఎం కేసీఆర్ ఉపేక్షించరని..నిందితులు ఎంతటివారైనా శిక్ష తప్పదన్నారు‌. మమత హత్య కేసులో నిందితులు ఎవరైనా, వదిలే ప్రసక్తే లేదని, యాదవ సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు. అంతేకాదు పుర్రె మమత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. గత ఆరేళ్ల నుండి మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్, షీ టీంలను ఏర్పాటు, దిశా ఎన్ కౌంటర్ వంటి విషయాలను గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్, ఇతర నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిసారు.

- Advertisement -