మైనారిటీ గురుకులాలు దేశానికే ఆదర్శం- మంత్రులు

241
ministers
- Advertisement -

మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సోసైటీ 7వ పాలక మండలి సమావేశం శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్ లో సొసైటీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ఛైర్మన్ హోదాలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడి హోదాలో హోం మంత్రి మహమూద్ అలీ హజరైయ్యారు. ఈసమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్,ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి షానవాజ్ ఖాసీం, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారు. ఈ గురుకులాలు వినూత్న పద్ధతిలో కొనసాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంచి ఫలితాలు సాధిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నాయన్నారు. దీంతో సీట్లకు డిమాండ్ బాగా పెరిగింది. మైనారిటీ గురుకులాలకు చెందిన 121పాఠశాలలను కళాశాలలుగా ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని అప్ గ్రేడ్ చేయాలని పాలక మండలి తీర్మానించింది. జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలు చాటే విధంగా 10పాఠశాలలను సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దేందుకు మండలి ఆమోదం తెలిపిందన్నారు. వీటిలో 5పాఠశాలలు బాలుర,5పాఠశాలలు బాలికలకు చెందినవి. ఆదిలాబాద్, జహీరాబాద్,నిర్మల్, నిజామాబాద్ లలో కొత్తగా కట్టిన పాఠశాలల భవనాలను తొందరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు విద్యావంతులై జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే సదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.ఈ గురుకులాలలో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నాం. విదేశాలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు గాను ఒక్కొక్కరికి 20లక్షల రూపాయల చొప్పున ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గురుకుల విద్యా సంస్థలను తెలంగాణ ప్రజలు గర్వించేలా గొప్పగా తీర్చిదిద్దుతున్న షఫీవుల్లా, ప్రవీణ్ కుమార్ లను మంత్రులు కొప్పుల,అలీలు అభినందించారు.జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన మైనారిటీ గురుకులాలకు చెందిన 10మంది విద్యార్థులను మంత్రి ఈశ్వర్ సత్కరించి, శుభాభినందనలు తెలిపారు.

- Advertisement -