శిల్పారామంను సందర్శించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌..

449
Minister Srinivas Goud
- Advertisement -

బుధవారం రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని శిల్పారామంను సందర్శించి, అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వీ .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ కళలు, సాంప్రదాయాలు, చేతి వృత్తులకు పూర్వ వైభవం సంతరించుకుందన్నారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శిల్పారామం అభివృద్ధిపై స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావుతో పాటు టూరిజం అధికారులతో చర్చించారు. శిల్పారామం ఆర్థిక స్వావలంబన సాధించటానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు.

శిల్పారామం మరియు పర్యాటక స్థలాలలో ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం లీజులు తీసుకున్న సంస్థలు లీజు డబ్బులు ప్రభుత్వానికి కట్టకుండా కోర్టులలో స్టేలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సంస్థలపై వెంటనే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్. పర్యాటకులను ఆకర్షించేందుకు, కళల పోషణకు, సాంప్రదాయ చేతి వృత్తుల వస్తువుల అమ్మకాల కు మరియు చేనేత వస్త్రాలు, పోచంపల్లి చీరలు, గద్వాల, సిరిసిల్ల, నారాయణ పేట, కాలంకారి, చేర్యాల పెయింటింగ్స్ లతో కేంద్ర బిందువు కావాలన్నారు. వీటితోపాటు ఇతర జిల్లాల్లో నిర్మిస్తున్న మినీ శిల్పారామాలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు.

శిల్పారామంలో ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మినీ శిల్పారామం నిర్మాణ పనులు మరియు డిజైన్ లను మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న మినీ శిల్పారామంలో గ్రామీణ వాతావరణం, సాంప్రదాయాలు, చేతి వృత్తుల తో తయారైన వస్తువులు, పిల్లల ఆట కేంద్రాలతో పాటు మానసిక ఉల్లాస కేంద్రాలు, సాంప్రదాయ ఫుడ్ కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో మినీ శిల్పారామాల ఏర్పాటుపై మంత్రి అధికారులతో చర్చించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా శిల్పారామంలో సందర్శకుల కోసం నిత్యం శానిటైజర్ లు, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చిన వెంటనే అప్పుడు శిల్పారామంను తెరిచేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యటకాభివృద్ధి సంస్థ ఈడీ శంకర్ రెడ్డి, టూరిజం లీగల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, టూరిజం అధికారులు మరియు శిల్పారామం అధికారులు కిషన్ దాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -