గిరిజన గ్రామాల విద్యుత్‌ పనులపై మంత్రి సత్యవతి సమీక్ష

257
sathyavathi
- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ మేరకు సింగిల్ ఫేజ్ కరెంటు ఉన్న గిరిజన గ్రామాలు, ఆవాసాల్లో వెంటనే త్రి ఫేజ్ కరెంటు ఇవ్వాలని, కోడంగల్, మహబూబాబాద్ మరియు డోర్నకల్ నియోజకవర్గాల్లో 10 కోట్ల రూపాయలతో గిరిజనులకు డైరీ డెవలప్ మెంట్ పనులు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

ట్రైబల్ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద అందుబాటులో ఉన్న 163.67 కోట్ల రూపాయల ద్వారా నిర్ణయించిన నోడల్ ఏజన్సీలతో గిరిజన గ్రామాలు, తండాలలో సింగిల్ ఫేజ్ కరెంటు 3 ఫేజ్ కరెంటుకు మార్చడం, కోడంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనులకు డైరీ డెవలప్ మెంట్ పనులు చేపట్టడం, గిరిజన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయడంపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఎన్పీడీసీఎల్ సిఎండీ రఘుమారెడ్డి, టిఎస్ ఐడీసి డైరెక్టర్ విద్యాసాగర్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.

గ్రామీణ విద్యుదీకరణ పథకం కింద సింగిల్ ఫేజ్ కరెంటు ఉన్నట్లు గుర్తించిన 2221 గిరిజన గ్రామాలకు త్రి ఫేజ్ కరెంటు ఇవ్వడం కోసం మొదటి దశలో 117.82 కోట్ల రూపాయలను కేటాయించారని, వెంటనే ఈ పనులు చేపట్టి పూర్తి చేస్తే గిరిజనులకు చాలా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి వద్ద అనేక గిరిజన గ్రామాల్లో త్రి ఫేజ్ కరెంటు లేదని చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందించి, ఈ గ్రామాల్లో త్రి ఫేజ్ కరెంట్ ఇవ్వడానికి ప్రతిపాదనలు రూపొందించి, పనులు చేపట్టాలని ఆదేశించారన్నారు.

దీనిపై అధికారులు దాదాపు 300 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారని, ఇందులో మొదటి దశలో 117.82 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు.కాబట్టి ఈ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేస్తే రెండో విడత నిధులు కూడా మంజూరు చేయడానికి వీలవుతుందన్నారు.దీనిపై తెలంగాణ ఎన్పీడీసీఎల్ సిఎండి స్పందిస్తూ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల గిరిజన గ్రామాల్లో నీరు బాగా ఉందని, వర్షాలు ఆగిపోయిన వెంటనే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ కేటిఆర్ గారు కోడంగల్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకున్నారని, అక్కడి గిరిజనుల అభివృద్ధి కోసం డైరి డెవల్మెంట్ స్వయం ఉపాధి కల్పిస్తామన్నారని, దీనికి గిరిజన శాఖ ఇప్పటికే నిధుల ప్రతిపాదనలు పూర్తి చేసిందని, సంబంధిత నోడల్ ఏజన్సీ పనులు చేపట్టాలన్నారు.

కోడంగల్ నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల్లో డైరీ డెవలప్ మెంట్ కోసం 10 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనికి ఆర్ధిక శాఖ ఆమోదం లభిస్తే పనులు ప్రారంభం అవుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో డైరీ డెవల్ మెంట్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామని, ఇది విజయవంతం అయితే అంతటా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడే గిరిజనులకు డైరీ డెవలప్ మెంట్ కార్యక్రమం ఒక ముందడుగు అవుతుందన్నారు.

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సాగునీరందించేందుకు 2015లో 70 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి, పూర్తి చేశారని దీనికి ఆర్ధిక శాఖ ధృవీకరణ (ర్యాటిఫికేషన్) కావాలని టిఎస్ ఐడీసీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు.గిరిజన ప్రాంతాల్లో ఆవాసాలకు త్రి ఫేజ్ కరెంటు ఇవ్వడం, గిరిజనులకు డైరీ డెవలప్ మెంట్ కార్యక్రమం తీసుకోవడం వంటివి చాలా మంచి కార్యక్రమాలని వీటికి ఆర్ధిక శాఖ నుంచి ఎలాంటి సమస్యలు లేవని, ఈ ప్రతిపాదనలన్నింటికి ఆమోదం ఇస్తున్నట్లు ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీదేవి ప్రకటించారు. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 70 కోట్లరూపాయల ప్రతిపాదనలు వెంటనే పంపితే ధృవీకరిస్తామన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు, పనులు వెంటనే ప్రారంభించేందుకు సిద్ధమైన అధికారులకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు

- Advertisement -