రైతు బంధు పథకంపై కేంద్రం ప్రశంసలు..

210
niranjan reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనిచ్చిన ప్రజంటేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రైతులను సంఘటితం చేయడానికి ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితిలను ఏర్పాటు చేసిందని, దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్ నెట్ వర్క్ విస్తరించిందని వివరించారు. ఈ నెట్ వర్క్ ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ లాంటివి సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ప్రజంటేషన్ లో ప్రస్తావించారు.కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయంలోనే నాబార్డు చైర్మన్ తో ముందుగా నిర్ణయించిన సమావేశం ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరుఫున పలు సూచనలు చేశారు.

‘‘అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది. వ్యవసాయ రంగాభివృద్ధికి, వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి ఈ కొత్త పథకం తప్పక దోహద పడుతుందని ఆశిస్తున్నది. అయితే, ఈ స్కీమ్ ద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికిచ్చే రుణాలకు విధించే వడ్డీలో 3 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రతిపాదించారు. కానీ, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిపై వడ్డీ భారం పడకుండా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వడ్డీ భారం ప్రభుత్వం భరించాలి. వడ్డీలేని రుణాలు సమకూరడం వల్ల ప్రభుత్వం ఆశించినట్లు ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు’’ అని నిరంజన్ రెడ్డి కేంద్ర మంత్రికి సూచించారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు 7వేల కోట్ల రూపాయలను ప్రతీ పంటకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతుబంధు సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో లక్షా 65 వేల మంది కమిటి బాధ్యులుగా ఉన్నారు. ప్రతీ 5వేల ఎకరాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి, ప్రతీ క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించాం. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతుల నెట్ వర్క్ విస్తరించింది. సాగునీటి వసతులు పెరగడం వల్ల, వ్యవసాయానుకూల నిర్ణయాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంటసాగు విస్తీర్ణం 39 శాతం పెరిగింది. ఇప్పటికే కోటి 36 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమయింది. కొద్ది రోజుల్లోనే మరో నాలుగైదు లక్షల ఎకరాల్లో నార్లు పడే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం సాగుతున్నందున తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరవులను, ముఖ్యంగా యూరియాను త్వరగా రాష్ట్రానికి పంపాలి’’ అని నిరంజన్ రెడ్డి కోరారు.

‘‘వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో సంస్కరణలు తెస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్కరణలు ఎలా ఉంటాయనే విషయంలో స్పష్టత కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మార్కెట్ కమిటీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. వాటిలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నాము. మార్కెట్ కమిటీల పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. కేంద్రం సంస్కరణలు అమలు చేస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి, పథకాలు ఎలా కొనసాగించాలనే విషయంలో స్పష్టత కావాలి’’ అని నిరంజన్ రెడ్డి కోరారు.రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -