దసరా నాటికి రైతు వేదికలు:ప్రశాంత్ రెడ్డి

164
Minister-Vemula-Prashanth-Reddy

ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర రోడ్లు-బావనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరా తీశారు.గురువారం పలు అంశాలపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు.

“జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కాబట్టి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలి.అట్లాగే ఎస్సారెస్పీ పూర్తి స్థాయిలో నిండి కిందకి నీటిని విడుదల చేస్తున్నందున పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తూ ఉండాలి.జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా జిల్లాకు ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా 2వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.మరో రెండు మూడు రోజుల్లో జిల్లా రైతాంగానికి సరి పడేంత యూరియా రానుంది.రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

యూరియా సరఫరా, పంపిణీ పై సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. జిల్లాలో క్లస్టర్ వారిగా చేపట్టిన రైతు వేదికలు నిర్మాణం పనుల్లో వేగం పెంచి దసరా నాటికి పూర్తి చేయాలి.పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టిన క్రిమాటోరియాలు,గ్రామ పార్కులు అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీతో రైతులు నిర్మించుకుంటున్న కల్లాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలి.సీజనల్ వ్యాధులు దరిచేరకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు పరి రక్షించడం తో పాటు పచ్చదనానికి పెద్ద పీట వేయాలి”అని మంత్రి వేముల కలెక్టర్ తో అన్నారు.