నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయం : మంత్రి కేటీఆర్

232
ktr
- Advertisement -

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కోరారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా.. తెలంగాణ చైతన్యాన్ని, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక ద్వారా టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదర్శ రైతులు, రైతాంగం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన రైతు సంక్షేమ మరియు వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని, పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కోరారు. ఒకవైపు ప్రాజెక్టులను నిర్వహిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రభుత్వం టిఆర్ఎస్ అని  కేటీఆర్ అన్నారు. దీంతోపాటు కాలువల ఆధునికీకరణ, పూర్వ నిజామాబాద్ జిల్లాలో ప్రాంతాలైన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని కేటీఆర్ తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో  నూతన జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు, పదుల సంఖ్యలో నూతన గ్రామ పంచాయతీలు, మండలాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విధంగా ప్రజల వద్దకు పరిపాలన ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సంస్కరణలలో భాగంగా తీసుకువచ్చిన నూతన రెవెన్యూ, పురపాలక పంచాయతీరాజ్ చట్టాల ద్వారా అటు పల్లెల్లోనూ, పట్టణాలలోనూ మార్పులు వస్తున్నాయన్నారు.

ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు అసూయతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అభివృద్ధిలో తమతో పోటీపడలేక, ఇలాంటి దుష్ట శక్తులు చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ.. అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోందని తెలిపారు. కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టే పార్టీలను టిఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటున్నదని అన్నారు.

తాజాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచి టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపిస్తామని కేటీఆర్ అన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించిన టిఆర్ఎస్ పార్టీ నీ అంతే స్థాయిలో విద్యుత్ సంస్కరణల పేరిట రైతులకు ఉచిత విద్యుత్ కి ప్రమాదం తీసుకువచ్చే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం అవసరమైతే దేవునితో పోరాడుతాం అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పిటిసిలకు ప్రత్యేక నిధుల విషయంలో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, అని ఇందుకు సంబంధించి ఒక పరిష్కారం తో ముందుకువస్తున్నదని అన్నారు. దీంతోపాటు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సమస్యలు సైతం తమకు తెలుసని మునిసిపాలిటీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి, తమ తమ వార్డుల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూస్తున్నామని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తమ ప్రభుత్వ పనితీరుని అర్థం చేసుకొని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -