ఉమ్మడి జిల్లా సురక్షితం- మంత్రి జగదీష్ రెడ్డి

483
Minister Jagadish Reddy
- Advertisement -

కరోనా వైరస్ మహమ్మారీ ప్రపంచాన్ని కబలిస్తున్నా అదృష్ట వశాత్తు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ప్రబలక పోవడం మన అదృష్టం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలలో అడుగుపెడుతున్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తంగా ఉండడం అందుకు సకాలంలో అధికారులు రంగంలోకి దిగడమే అందుకు కారణమని ఆయన అభివర్ణించారు.

బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుండి మూడు జిల్లాల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ,సూర్యపేటలతో పాటు బోనగిరి-యాదాద్రి జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్,వినయ్ కృష్ణారెడ్డి,అనితా రామచంద్రన్ లు,యస్ పి లు ఏ వి రంగనాధ్,భాస్కరన్ బోనగిరి యాదాద్రి డిసిపి లు మూడు జిల్లాల డి యం హెచ్ ఓ లు ఉమ్మడి జిల్లాలోని ఆర్ డి ఓ లు ఈ సెల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఉమ్మడి జిల్లా అధికారులు గృహానిర్బంధం లోకి తీసుకున్నప్పటికీ నిన్నమొన్న వెలుగు చూసిన పరిణామాలు మూడు జిల్లాలను కొంత ఉలిక్కిపడేలా చేసిందని అయితే అదృష్టం కొద్దీ ఢిల్లీలో ప్రార్ధనలకు పోయిన వారిలో అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడం శుభపరిణామంగా ఆయన చెప్పుకొచ్చారు. అయినా వారందరినీ హోమ్ క్యారంటైన్ లో పెట్టి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఢిల్లీకి పోయి వచ్చిన వారిలో మరో పది మందిని మిర్యాలగూడ ప్రాంతంలో గుర్తించి తమ పర్యవేక్షణలోకీ తీసుకున్నట్లు నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ మంత్రి దృష్టికి తీసుకరాగా ఆటువంటి వారిలో అవగాహన పెంచి స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేపించుకునేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోమ్ క్యారంటైన్ ఉన్న వారి వివరాలను తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి వారికి ప్రభుత్వం తరపున అందిస్తున్న వైద్యపరీక్షలు ఇతర ఏర్పాట్లు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

అదే విధంగా కాలి నడకన ఆంద్రప్రదేశ్‌కు చేరుకోవాలి అనుకున్న వారిని నిబంధనలు ఒప్పుకోక పోవడంతో సరిహద్దుల్లో నిలిపి వసతి సౌకర్యంతో పాటు ఆహారం అందిస్తున్నట్లు నల్గొండ యస్ పి రంగనాధ్ వివరించగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని అవసరమైతే అందుకు సంబంధించిన అధికారులను అక్కడికి పంపాలని మంత్రి సూచించారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమైనందున గ్రామాలలోకి తరలి వెళ్లే రైతాంగానికి ఆటంకం కలుగకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయం గ్రామాలలో ఉన్నప్పటికీ సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాలలో రైతులు నివాసముంటున్నారని అటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో భయపడకుండా తగు ధైర్యం కల్పించాలన్నారు.

అదే విధంగా బత్తాయి,నిమ్మ రైతులకు వాహనాలు సమకూర్చడంలో అధికారులు చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. అయితే అదే సమయంలో బత్తాయి,నిమ్మ లలో ఇటువంటి వైరస్‌ను తట్టుకునే గుణాలు ఉన్నందున ఎక్కువ శాతం జిల్లాలోని రైతు బజార్లకు కూరగాయల మార్కెట్లకు తరలించే యోచన చెయ్యాలన్నారు. అంతే గాకుండా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నందున కూరగాయలతో పాటు ఇతర నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -