మేడారం జాతర 2022 విజయవంతమైందని ప్రకటించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో వనదేవతల జాతర సజావుగా జరిగిందన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ గిరిజన జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని, ఈ జాతరకు రూ.75 కోట్లు మంజూరు చేశారన్నారు. నాలుగు జాతరలకు కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 332.71 వెచ్చించిందని తెలిపారు. ఈ నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, మౌలిక వసతుల కొరత తీరిందన్నారు.
జంపన్నవాగు వద్ద గతంలో కన్న ఎక్కువ స్నానాల ఘాట్లను నిర్మించామని చెప్పారు. తాగునీటి సౌకర్యం, శానిటేషన్, బస చేసే భక్తులకు తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేయడంతో ఎక్కడ కూడా తాగు నీటి సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ ఎదురు కాలేదని పేర్కొన్నారు. జాతరను బ్రహ్మండంగా నిర్వహించామని.. సహకరించిన భక్తులందరికి ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.