నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం: మంత్రి

49
- Advertisement -

నిర్మల్ పట్టణంలోని నాయుడి వాడ చౌరస్తా నుండి బంగల్ పెట్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. చౌరస్తా నుండి బంగల్ పెట్ వెళ్లే వరకు తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా క్యాంపు కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు పనులు పూర్తి అయ్యాయని బీటీ రోడ్డు పనులకు టెండర్లను పిలవడం జరిగిందని అన్నారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరి సహకారంతో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని మంత్రి అన్నారు.

బీటీ రోడ్డు పూర్తయిన తరువాత రోడ్డుకు ఇరువైపులా చెట్లు, కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. నాయుడి వాడ నుండి బంగల్ పెట్ వినాయక్ సాగర్ వరకు రోడ్డు వెడల్పు పనులు నిన్ననే ప్రారంభం అయ్యాయని.. తొందరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రం అయిన తరువాత పట్టణంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఏర్పడినందున వార్డుల్లో రెండు బస్సులు పట్టేంత విస్తీర్ణంలో రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు.ఎవరి ఒత్తిడి లేకున్నా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు వెడల్పు పనులకు సహకరించాలన్నారు.నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు.. నిర్మల్ పట్టణంలోని ఓల్డ్ సిటీ వెలుగులోకి వస్తుందని అన్నారు. పట్టణ ప్రజల కోసం 40 కోట్లతో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -