పని చేసే‌ వాళ్లు కావాలా.. మాటలు చెప్పే‌వాళ్లు కావాలా..!

136

పని చేసే‌ వాళ్లు కావాలా.. మాటలు చెప్పే‌వాళ్లు కావాలా.. ఇంకా రెండున్నరేళ్లు సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆయన ఆశీర్వాదంతో అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా.. కేసీఆర్‌ను‌ బలపర్చండి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాల‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ హజరైయ్యారు. ఇందులో భాగంగా వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో 19 గ్రామాల మహిళలకు, టౌన్ పరిధిలో 30 వార్డుల మహిళలకు వడ్డీ‌లేని రుణం ఇస్తున్నాం. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి, వడ్డీ లేని రుణాలు అన్నీ కలిపి 20 కోట్లు అక్కా చెళ్లెల్లకు ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మహిళలకు ఎక్కడైనా ఇస్తున్నారా! సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో మహిళా భవనాలున్నాయి. మరి హుజూరాబాద్‌లో ఎందుకు నిర్మించ‌లేదు‌.. అందుకే పదహారు గ్రామాల్లో 3 కోట్ల పదిలక్షలతో అన్ని వసతులతో మహిళా భవనాలు మంజూరు చేస్తున్నాం. మూడు నెలల్లో 20‌లక్షలతో మహిళా భవనాలు పూర్తి‌చేసి ఇస్తాం‌మని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు రూ. 2016 పెన్షన్ ఇవ్వాలని‌ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. త్వరలోనే మీకు అందజేస్తాం.కేసీఆర్ నిరాహారదీక్ష, మొండి పట్టుదల, మనమంతా ఒక్కటై కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ ఏడేళ్లలో‌ తెలంగాణ మంచిగ చేసుకున్నాం. ఆనాడు వ్యవసాయానికి కరెంట్ ఉండేది‌ కాదు. కాలిపోయే మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు. కేసీఆర్ వచ్చాక ఇంటిలో 24 గంటల కరెంట్, బాయి కాడ నాణ్యమైన విద్యుత్ వస్తోంది. అంతేకాదు పంట రుణాల కోసం నాడు బ్యాంకుల చుట్టూ నెలల తరబడి రైతులు తిరిగే పరిస్థితి. ఇవాళ రైతు కాలు గడప బయట పెట్టకుండానే బ్యాంకుల్లో ఏడాదికి ఎకరానికి పది వేలు చొప్పున జమ అవుతోంది. ఇగ ఎస్సారెస్పీ కాలువల్లో ఆనాడు నీరు వచ్చేది కాదు. పంటలు ఎండిపోయేవి. ఇవాళ కాళేశ్వరం నీరుతో కాలువలు నిండుగా పారుతున్నాయి. ఎరువులు, విత్తనాలకు తిప్పలు లేవు. కరెంట్ ఉచితం, నీటి తీరువా రద్దు, సాగు నీరు ఉచితంగా ఇస్తున్నమని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో పండిన కాడికి‌పంటను కొన్నాం. రానున్న రోజుల్లో ఐరోపా‌ సెంటర్స్ ను బలోపేతం చేస్తాం.మినీ గోడౌన్లు, సీసీ ఫ్లాట్ ఫాంలు నిర్మిస్తామన్నారు. తెలంగాణ పెన్షన్ ఆనాడు 200 రూ ఇస్తే దాన్ని 2016 రూ కు పెంచడం జరిగింది. హుజూరాబాద్ లో 38‌వేల‌మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎవరైనా 2016 పెన్షన్ ఇస్తున్నారా.. అని మంత్రి ప్రశ్నించారు. రానున్న రోజుల్లో‌ 57 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తాం… వారితో కలిపితే ఒక్క హుజూరాబాద్ లోనే 43 ‌వేల‌మందికి పెన్షన్ వస్తుంది.పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు దండగ అని రాజేందర్ అంటున్నారు.ఈ పథకాలు ఉండాలా…వద్దా…మీరే చెప్పండి… ఈ పథకాలు ఇచ్చే వాళ్లు కావాలా…వద్దనే వాళ్లు కావాలా ఆలోచించండి అని మంత్రి కోరారు. ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు. ఆత్మ గౌరవం అంటే ఆర్థిక స్వావలంబన . తన కాళ్ల మీద తాము నిలబడటం. పేదలకు ఉండటానికి ఇళ్లు, కడుపునిండా తిండి, నాణ్యమైన చదువుతో గౌరవంగా బతకడమే ఆత్మగౌరవం అన్నారు.

హుజూరాబాద్ కు సీఎం 4 వేల ఇళ్లు ఇచ్చారు. బాన్సువాడ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఖమ్మం ప్రాంతాలకు ఇళ్లు మంజూరు అయ్యాయి. సిద్దిపేటలో నేను, బాన్సువాడలో పోచారం, మహబూబ్‌నగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఇళ్లు నిర్మించారు. ఇక్కడ ఎందుకు నిర్మించ లేదు. ఎందుకు రాజేందర్ పట్టించుకోలేదు అని దుయ్యబట్టారు. ఈ ఇండ్లు కంట్టించే బాధ్యత నాది. నాలుగు వేల ఇండ్లు వెంటనే పూర్తి చేయిస్తా. స్వంత జాగా ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా 50 వేల‌లోపు రుణం ఉన్న ఆరు‌లక్షల మంది రైతులకు రుణ మాఫీ ఈ నెల 15న సీఎం మాఫీ చేయనున్నారు. ఈమేరకు 2008 కోట్లు రైతుల అక్కౌంట్లలో‌ జమ కానున్నాయని మంత్రి పేర్కొన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డిజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచింది. పెట్రోల్, డిజీల్, గ్యాస్‌ధరలను పెంచి‌ పేద ప్రజల‌ నడ్డి విరుస్తోంది. 60 రూపాయల డిజీల్‌ను 104 రూ కు పెంచి రైతులపై భారం వేస్తోంది బీజేపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఎకరానికి‌ ఐదు వేల‌ రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇస్తుంటే‌…గతంలో‌ఎకరంలో‌ట్రాక్టర్ పనికి 3 వేలు ఖర్చయ్యేవి. డిజీల్ ధరలు పెంచడంతో ఇప్పుడు ఎకరానికి ట్రాక్టర్ ఖర్చు 5 వేలు ఖర్చు వస్తోంది. రైతులకు మేం ఇచ్చే‌డబ్బులను బీజేపీ డిజిల్ ధరలు పెంచి రైతుకిచ్చిన డబ్బులు లాక్కోంటోంది. తెరాస పేదల‌‌‌ సంక్షేమం కోసం పని చేస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్స్‌లో‌‌ లక్ష 30 వేల మంది చదువుతుంటే..నేడు మూడు లక్షల ‌నలభై వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు.

పని చేసే‌ వాళ్లు కావాలా..మాటలు చెప్పే‌వాళ్లు కావాలా.. ఇంకా రెండున్నరేళ్లు సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆయన ఆశీర్వాదంతో అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా.. కేసీఆర్‌ను‌ బలపర్చండి. ఎండమావుల‌ వెనుక. పరుగెత్తకండి. బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీలు చెప్పే మొసలి‌కన్నీరుకు, తీయటి మాటలకు‌ ఆగం కావద్దు అని మంత్రి హరీశ్‌ రావు సూచించారు.