సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీష్‌ సమీక్ష..

32
harish rao

ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ పర్యటన సందర్భంగా కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమయాత్తం కావాలని జిల్లా అధికారిక వర్గాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేద్దామని అధికార వర్గాలకు మంత్రి ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయరును ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా జిల్లా అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం ఆలోచన అమలుకు రిజర్వాయర్ల జిల్లా వెనుక అధికారుల కృషి చాలా ఉన్నదని, ప్రతి శాఖ నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్నీ రంగాల్లో సిద్ధిపేట జిల్లాను తొలి స్థానంలో నిలువుతున్నారని అధికారుల పనితీరును మంత్రి కొనియాడారు.

జిల్లాలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలు చాలా చేశామని, ఎప్పుడూ, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రశంసలు పొందామని, ఈ నెల 29న జరిగే కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా నిర్వహిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. ప్రధానంగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అధికార వర్గాలకు మంత్రి ఆదేశం, సూచనలు ఇచ్చారు.

కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, శాఖల వారీగా జిల్లా అధికారులకు నిర్వాహక బాధ్యతలను అప్పగిస్తూ..చేపట్టాల్సిన విధులను మంత్రి హరీష్‌ రావు వివరించారు.