భీడు భూములను గోదావరి జలాలతో అభిషేకిస్తాం: కేటీఆర్

18

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12లను పూర్తి చేసి అక్టోబర్ లోగా జిల్లాలోని భీడు భూములను గోదావరి జలాలతో అభిషేకిస్తామని మంత్రి కే టీ ఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిలు పర్యటించారు. పర్యటనలో భాగంగా ముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు శంకుస్థాపన చేశారు. రాచర్ల బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్‌లో, వేములవాడ మహారాజ ఫంక్షన్ హాల్ లో నియంత్రిత సాగు విధానం పై స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, పాక్స్ చైర్మన్ లు, వ్యవసాయ శాఖ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రులు ప్రసంగించారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మూడు ఎండ్ల స్వల్ప కాలంలో రికార్డ్ స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంను సిఎం కేసీఆర్ రైతు సంక్షేమమే పరమావధిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. భగీరథుడు గంగమ్మను ఆకాశం నుంచి నేల మీదకి తెస్తే, అపర భగీరథుడు కేసీఆర్ సముద్ర మట్టంకు 85 మీటర్ల ఎత్తున పారుతున్న గోదారమ్మ ను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతుల భీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాడని అన్నారు.

వ్యవసాయంను పండుగగా మార్చి రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారు. మనమంతా సంఘటితమై విజయం సాధిస్తే అందరూ మనవెంటే వస్తారు అని మంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఎండకాలంలోనూ తెలంగాణలోని చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలో ఎండాకాలంలో సైతం ఇన్ని నీళ్లను చూసి కొందరి కళ్లు మండుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరగదన్నారు. రైతు వేదిక బలపడితేనే రైతు బాగుపడుతాడు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణాలకు ముందుకొస్తున్న వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ktr

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ,ఇబ్బందులు ఉన్నప్పటికీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 శాతం రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటకు సంబంధించి ఆర్థిక ప్రేరణగా రైతుబంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం. విడుదల చేసిందన్నారు. అట్లాగే రుణమాఫీ 5 లక్షల 50 వేల మంది రైతులకు 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీరు ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం రంగాల్లో కలిగిన మార్పుల గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు మంత్రి కేటీఆర్‌.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల 31 ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు . జిల్లాకు గోదావరి జలాలు రావడంతో వానకాలం మరో 19 వేల ఎకరాలలో పంట విస్తీర్ణం పెర గనుందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరు మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరిగిందని మంత్రి తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక సంవత్సర కాలంలో ఆరు మీటర్ల మేర భూగర్భజల మట్టం పెరగడం అనేది ఒక అరుదైన చర్య అని మంత్రి తెలిపారు. జిల్లాలో వరి,పత్తి పంట సాగు స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయి అన్నారు. గత వాన కాలంలో జిల్లాలో 3900 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని ప్రస్తుతం దాని స్థానంలో కందులు పంట సాగు చేయాలని రైతుల కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సోయా ఆయిల్ వంటి పంటలను సాగు చేసే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

జిల్లాకు గోదావరి జలాలు రావడంతో మండుటెండలో 77 చెరువులను నింపుకో గలిగానని మంత్రి పేర్కొన్నారు. ఇది రైతులకు అత్యంత గొప్ప విజయమని పేర్కొన్నారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే మొత్తం రెండున్నర లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందం ఉందని మంత్రి తెలిపారు . వచ్చే అక్టోబర్ కల్లా ప్రాజెక్టుల నిర్మాణం మొత్తం పూర్తి చేసి బీడు భూములకు సాగు జనాలను అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి ఇంచు భూమికి సాగు జలాలు లభించేలా చూసేందుకు పిల్ల కాలువల నిర్మాణం తప్పనిసరి అని మంత్రి తెలిపారు. పిల్ల కాలువల నిర్మాణానికి ప్రతి గ్రామంలో కనీసం పది నుంచి పదిహేను ఎకరాలు అవసర మవుతుందనీ మంత్రి పేర్కొన్నారు. పది మందికి స్వల్పంగా నష్టం జరిగిన వందల మందికి గొప్ప ప్రయోజనం మేలు కలుగుతుందన్నారు. కాబట్టి రైతులు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్ల కాలువ నిర్మాణం చేపట్టాలన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యాక అందరూ ఒకే పంటను సాగు చేయడం చేశారని మంత్రి పొరుగు రాష్ట్రాల అనుభవాన్ని వివరించారు. దానివల్ల మార్కెట్ సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. తద్వారా రైతు పండించిన పంటను తగిన డిమాండు లేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందన్నారు. ఆ సమస్యలు దూరం చేసేందుకే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు సాహసోపేతంగా చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఎద్దు ఎడి సిన వ్యవసాయం,రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నినాదంను నమ్మి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు చేపట్టిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని కోటి ఎకరాలను ఆకుపచ్చని మాగానం గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే నియంత్రిత పంటల సాగు తో వ్యవసాయాన్ని పండగ గా మార్చి రైతులు రాజుగా మార్చాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది అన్నారు. అలాగే లాభదాయక పంటలపై మెలుకువలు నేర్చుకునేందుకు ఆలోచనలు పంచుకునేందుకు ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందన్నారు. వచ్చే రెండు నెలల్లో వీటి నిర్మాణం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గోదావరి జలాలతో రైతుల కాళ్ళు కడిగిన ప్రభుత్వం ఉన్నంతకాలం రైతులకు ఏ మాత్రం అన్యాయం చేయబోదని మంత్రి తెలిపారు విప్లవాత్మక విమర్శలు సాధారణమేనని పేర్కొన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాధార విమర్శలకు వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. రైతు బంధు మాదిరి రాష్ట్రంలో తొలిసారి చేపట్టనున్న నియంత్రిత పంటల సాగు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.