వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష..

213
minister gangula
- Advertisement -

ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతోన్న నేపథ్యంలో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం పౌర సరఫరాల భవన్‌లో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ, కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో సమీక్షించారు. గత ఏడాది వానాకాలంలో 3,670 కొనుగోలు కేంద్రాల ద్వారా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ వానాకాలంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐ.కె పి, 2131, పి.ఎ.సి.ఎస్, 3964, ఇతర 313 మొత్తం 6,400 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటి వరకు నిజామాబాద్ , కామారెడ్డి ,మెదక్ , సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో 1, 071 కేంద్రాలను ప్రారంభిచటం జరిగింది. ఆయా జిల్లాల్లో స్థానిక అవసరాలను బట్టి అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం తేమ శాతం 17 లోపు వుండేలా , రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైస్ మిల్లర్ల న్యాయపరమైన సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా వున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకు వెళ్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. వచ్చే నెల మొదటి వారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా దించుకోవాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. భారీగా ధాన్యం దిగుబడి అవుతోన్న నేపధ్యంలో రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లర్లపై కూడా వుందన్నారు.

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎంతో చేస్తున్నారని ఆయన ఆలోచనకు అనుగుణంగా పని చేయాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి సహకారం అందించటంలో వ్యాపార కోణంలో కాకుండా, సామాజిక కోణంలో ఆలోచన చేయాలన్నారు. రైతును రాజును చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి మనమందరం అండగా నిలవాలన్నారు.

- Advertisement -