ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు- మంత్రి ఎర్రబెల్లి

144
Minister Errabelli
- Advertisement -

బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం, ఐక్యమత్యానికి బక్రీద్ ప్రతీక అని ఆయన అన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని, కుల, మతాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాల‌ని ఆయన ఆకాంక్షించారు.

అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన మైనార్టీ కుటుంబాలకు ప్రత్యేకంగా ముస్లింల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో మైనార్టీ కుటుంబాల సంక్షేమానికి 2008 నుండి 2014 మద్యకాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 5900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు నాలుగున్నర లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 116 రూపాయల సహాయం షాదీ ముబార‌క్ పథకం ద్వారా అందజేస్తున్నదని ఆయన తెలిపారు.హైదరాబాద్ లోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని మసీదులలో ప్రార్థనలు చేసే 10 వేల మంది ఇమామ్ లకు ప్రతినెలా 5 వేల రూపాయల భృతి అందించబడుతున్నదని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇమామ్, మౌజన్ లకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల భృతిగా చెల్లించిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం 53 కోట్ల రూపాయల గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉర్దూ అకాడమీ నిర్వహణకు 40 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లిం కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల వారి జీవితాలలో గుణాత్మకమైన అభివృద్ధికి బాటలు వేస్తుండటం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -