కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలను సంరక్షించాలి- మంత్రి

22
Minister Errabelli

సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా నాటిన కోటి వృక్షార్చన మొక్కలను సంరక్షించాలి. అవి పెరిగే, మన గలిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు అంతా ఇందుకనుగునంగా పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా పనులపై మంత్రి, హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయం, మంత్రుల నివాసంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు లతో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కోటి వృక్షార్చానలో భాగంగా నాటిన మొక్కలన్నింటిని సంరక్షించే బాధ్యతను, సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు తీసుకోవాలన్నారు. సీఎం కెసిఆర్ చేపట్టిన హరితహరానికి తోడుగా ఈ మొక్కలు పెరగాలన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి కోరారు. ఇదే తరహాలో ప్రగతిలో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తి కావాలని ఆదేశించారు.

పదోన్నతుల పోస్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేయండి. పదోన్నతుల తర్వాత ఏమైనా పోస్టులు మిగిలి ఉన్నాయా? పరిశీలించండి. ఆ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి అని ఆదేశించారు.సీఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా, రైతులను సంఘటితం చేయడానికి ఏర్పాటు చేసిన రైతు వేదికలలో కేవలం 9 మాత్రమే, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వెంటనే వాటిని పూర్తి చేయండి. ఉపాధి హామీ కేంద్ర నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి రండి. ఇంకా మన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, కొత్తగా తీసుక రావాల్సిన నిధులు, పనుల కోసం తీవ్రంగా కృషి చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ఇక ఉపాధి హామీ అనుసంధాన పనులు కొనసాగాలి. వాటితో జరిగే అభివృద్ధి పనులు ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

నిరంతరాయంగా పల్లెల్లో పారిశుద్ధ్యం కొనసాగాలి. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి. తద్వారా అటు, సీజనల్ వ్యాధులు అదుపులో ఉండే విధంగా వ్యవహరించాలి. పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, కల్లాలు పూర్తి కావాలి. నిర్ణీత సమయంలో ప్రతి పని పూర్తికావడానికి అధికారులు అవసరమైతే, క్షేత్ర పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించారు.