స్వీయ నిర్బంధమే శ్రీ‌రామ ర‌క్షఃమంత్రి ఎర్రబెల్లి

323
Minister Errabelli
- Advertisement -

క‌రోనా వైర‌స్ కి విరుగుడు లేదు. నిర్మూల‌న అంత ఈజీ కాదు. నియంత్ర‌ణ మాత్ర‌మే సాధ్యం అందుకే… మ‌నం స్వ‌యం నియంత్ర‌ణ‌తో ఉందాం… స్వీయ నిర్బంధాన్ని పాటిద్దాం…అవే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష‌!… ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాలంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను పాటిద్దాం. నేను కూడా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇంట్లోనే ఉంటున్నా… ప‌చ్చ‌ద‌నం-పరిశుభ్ర‌త నిర్వ‌హిస్తున్నాను…మీరు కూడా ఇళ్ళ‌ల్లోనే ఉండండి… అంటూ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా, త‌న స్వగ్రామం ప‌ర్వ‌త‌గిరిలో కుటుంబంతో క‌లిసి ఉన్న మంత్రి, ఇంట్లో త‌మ స‌తీమ‌ణి ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఇంట్లో ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప‌క్షుల‌కు గింజ‌లు వేస్తూ, నీరు పెడుతూ గ‌డుపుతున్నారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఓ ప్రెస్ నోటు విడుద‌ల చేస్తూ,.. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా నిన్న ఆదివారం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చిన పిలుపు మేర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ ని విజ‌య‌వంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. క‌రోనా నియ‌త్రంణ‌కు సీఎం కెసిఆర్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అన్నీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ద‌ని, ప్ర‌జ‌లు స్వ‌యం నియంత్ర‌ణ‌, స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ, ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఇంట్లోనే ఉండాల‌ని పిలుపునిచ్చారు. అలాగే కుటుంబాల‌తో గుడ‌పుతూ, మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల్లో భాగంగా వ‌స్తున్న కుటుంబ జీవ‌నాన్ని ఎంజాయ్ చేయాల‌ని సూచించారు. త‌ద్వారా కుటుంబ సంబంధాలు మెరుగు ప‌డ‌తాయ‌ని అన్నారు.

ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు…క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను వణికిస్తున్న‌ది. చైనా, ఇట‌లీ లాంటి దేశాలు కరోనా బారిన‌ప‌డి ఇంకా కోలుకోవడం లేదు. మ‌నం ముందే మేల్కొన్నాం. అందుకే తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ఎంతో ముందుచూపుతో, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా క‌రోనా నిర్మూల‌న కంటే అది విస్త‌రించ‌కుండా అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా, రాష్ట్ర‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. నిర్లిప్త‌త‌, ఉదాసీన‌త ప‌నికిరాదు. మ‌న అజాగ్ర‌త్త ఎవ్వ‌రికీ ప్రాణాంత‌కం కారాదు. ఇందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి. అన్నారు. ఇది ఇంట్లోనే ఉండి…కంటికి క‌నిపించ‌ని క‌రోనాతో చేసే యుద్ధం…ఇందులో మ‌న‌దే విజ‌యం కావాల‌ని అకాంక్షించారు.

అంతేగాక పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కూడా ప్ర‌త్యేకంగా పిలుపునిస్తున్నా…అనేక అంశాల్లో మ‌నం ఆద‌ర్శంగా ముందు ఉన్నాం. నాటి పాల‌కుర్కి సోమ‌నాథుడి నుండి ఐల‌మ్మ దాకా, తెలంగాణ ఉద్య‌మం నుండి తెలంగాణ‌ని అభివృద్ధి ప‌ర‌చుకునే అభివృద్ధి ఉద్య‌మం దాకా…నేటికీ చైత‌న్య శీలురైన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లారా…మీరు ఇళ్ళ‌కే ప‌రిమితం కండి…అత్యంత అవ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఇళ్ళ నుండి బ‌య‌ట‌కు రావ‌ద్దు. మీ పిల్లా పాప‌ల‌ని బ‌య‌ట‌కు రానివ్వొద్దు. రోడ్ల‌పై స‌మూహాలుగా గుమికూడ‌వ‌ద్దు. అన్నారు. అలాగే అదృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టి వ‌ర‌కుక మ‌న‌కు క‌రోనా రాలేదు. భ‌విష్య‌త్తులోనూ క‌రోనా బారిన ప‌డుకుండా ఉండాలంటే… గృహ నిర్బంధంలో ఎవ‌రికి వారుండాలి. మ‌నం బాగుండాలి. మ‌నం చుట్టుముట్టు స‌మాజ‌మంతా బాగుండాలి… అప్పుడే రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించండి. లాక్ డౌన్ కి పూర్తిగా క‌ట్టుబ‌డండి… క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పౌరులుగా మీ క‌ర్త‌వ్యాన్ని నెరవేర్చండి… అంటూ పిలుపునిచ్చారు.

Errabelli

మ‌రోవైపు మంత్రి ఎర్ర‌బెల్లి త‌న స్వ‌గ్రామం ప‌ర్వ‌త‌గిరిలో త‌మ స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి ఉష గారితో క‌లిసి ఉన్న వీడియోలు, ఫోటోల‌ను మీడియాకి విడుద‌ల చేశారు. ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌ని పాటిస్తూ, ఇంటి ఆవ‌ర‌ణ‌ని శుభ్రం చేయిస్తూ ఉన్నారు. అంతేగాక ప‌క్షుల‌కు గింజ‌లు వేస్తూ గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా తన‌లాగే… మిగ‌తా వాళ్ళంతా…ఇళ్ళ‌ల్లోనే ఉండాల‌ని పిలుపునిచ్చారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా…వైర‌స్ విస్త‌రించాక న‌ష్ట‌పోవ‌డంకంటే.. న‌ష్ట‌ నివార‌ణ‌కు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని చాటారు.

- Advertisement -