మిష‌న్ భ‌గీర‌థపై బ‌ట్ట‌బ‌య‌లైన కేంద్రం వివ‌క్ష‌- మంత్రి ఎర్ర‌బెల్లి

28

ఇంటింటికీ సుర‌క్షిత‌మైన తాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న మిష‌న్ భగీర‌థ ప‌థ‌కం విష‌యంలో కేంద్రం ప‌క్ష‌పాత ధోర‌ణి మ‌రోమారు పార్ల‌మెంటు సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లు అయింద‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌ర‌ల‌ శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో ఓ ప్ర‌శ‌కు స‌మాధానంగా కేంద్ర జ‌ల‌జీవ‌న్ మిష‌న్ శాఖ‌మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మాట్లాడుతూ, 2018 నుంచి 2021-22 వ‌ర‌కు 2455.82 కోట్ల రూపాయ‌ల నిధులు కేటాయించామ‌ని లిఖిత‌పూర్వ‌కంగా తెలిపారు. అందులో ఈ నాలుగేళ్ల‌లో కేవ‌లం రూ. 311. 41 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే విడుద‌ల చేశామ‌ని మంత్రి తెలిపారు. ఈ నిధుల‌ను సైతం నేష‌న‌ల్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ వాట‌ర్ స‌ప్లై ప్రోగ్రాం నిర్వ‌హ‌ణ మ‌రియు దానిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మానికి వినియోగించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌కు అందించ‌లేదు. పైగా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ఆకాశానికి ఎత్తుతూ, అద్భుతంగా ఉంద‌ని అభినందిస్తూ అనేక అవార్డుల‌ను కేంద్ర‌మే ఇచ్చింది. అలాగే మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని కాపీ కొట్టి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాన్ని జాతీయ స్థాయిలో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ద‌శ‌లో అనేక రాష్ట్రాలు కూడా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ఆయా రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

ఒక ద‌శ‌లో నీతి ఆయోగ్ 19వేల కోట్లు మిష‌న్ భ‌గీర‌థ‌కు ఇవ్వాల‌ని సిఫార‌సు చేసినా కేంద్రం ప‌ట్టించుకోలేదు. అదే కేంద్ర ప్ర‌భుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ , గుజ‌రాత్‌ల‌కు ప‌నులు మొద‌లుపెట్టిన ద‌శ‌లోనే వంద‌లాది కోట్ల రూపాయ‌ల నిధుల‌ను ధారాద‌త్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వ నయాపైసా స‌హాయం లేకుండా 35వేల కోట్లతో సొంతం మ‌న సీఎం కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో ఖ‌ర్చు చేసి విజ‌య‌వంతంగా వంద‌కు వంద శాతం ఇంటింటికీ న‌ల్లాల ద్వారా సుర‌క్షిత‌మైన మంచినీటిని రాష్ట్రవ్యాప్తంగా అందిస్తూ, అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందారు అని మంత్రి విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష మానుకొని త‌గు నిధులు అందించాల‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు డిమాండ్ చేశారు.