తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను కేటాయించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ విజ్ఞప్తి చేశారు. స్టోరేజ్ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులతో శుక్రవారం పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ శ్రీ అశ్వినీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల సంస్థ సమన్వయంతో పనిచేసి, అలాగే జిల్లాల వారీగా సమావేశమై సమస్యను అధిగమించాలని సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్రంలో ఏటేటా ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని, ఈ ఏడాది పౌరసరఫరాల సంస్థ ఖరీఫ్‌లో 55 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 37 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకు అవసరమైన స్టోరేజ్ స్పేస్‌ను సమకూర్చాలని కమిషనర్ కోరారు. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గత ఏడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించడానికి సిద్ధాంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన స్టోరేజ్ స్పేస్‌ను కేటాయించాలని కోరారు.
ఎఫ్‌సీఐ నుండి రావాల్సిన బకాయిలు సీఎంఆర్ రూ. 888 కోట్లు, ఆర్‌డి సెస్ రూ. 95 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కమిషనర్ అకున్ సబర్వాల్ చేసిన విజ్ఞప్తిపై ఎఫ్‌సీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి కరీంనగర్, కొత్తగూడెం జిల్లాలో స్టోరేజ్ సమస్య అధికంగా ఉందని, తక్షణం సమస్యను పరిష్కరించాలని కమిషనర్ చేసిన విజ్ఞప్తిపై ఎఫ్‌సీఐ ఆధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు, బియ్యం నిల్వల అవసారలను దృష్టిలో పెట్టుకొని తాము చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఎఫ్‌సీఐ అధికారులు ఈ సందర్భంగా కమిషనర్‌కి విజ్ఞప్తి చేశారు.