మహీ మాయ చూశారా..?

238
Online News Portal
Watch the Mahi magic on loop
- Advertisement -

నాలుగో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌లో విఫలమైనా.. తన రాంచీ అభిమానులను మాత్రం నిరాశపర్చలేదు. ధోనీ కీపింగ్ స్టైల్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుధవారం న్యూజీలాండ్‌తో జరిగిన వన్డేలో వికెట్లను చూడకుండానే ధోని బంతిని విసిరి రనౌట్‌ చేయడం అతని నైపుణ్యాలను మరింత ప్రస్ఫుటం చేసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 150 స్టంపింగ్స్‌ పూర్తి చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డులు సృష్టించిన ధోని తన సొంతగడ్డపై అభిమానుల్ని కీపింగ్‌తో మురిపించాడు.

ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ వేసిన ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా బంతిని నెట్టిన రాస్‌ టేలర్‌ ఒక పరుగు తీసి.. ఫీల్డర్‌ బంతికి దూరంగా ఉండటంతో రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫీల్డర్‌ కులకర్ణి వేగంగా బంతిని కీపర్‌ ధోనీకి అందించగా.. అప్పటికే బంతి కోసం అటువైపు తిరిగి ఎదురుచూస్తున్న ధోని మెరుపు వేగంతో వెనక్కి తిరగకుండానే వికెట్లపైకి బంతిని విసిరేశాడు. సాధారణంగా క్రికెటర్లు వికెట్లను గురి చూసి విసిరిన బంతులే వాటిని తాకకుండా అప్పుడప్పుడూ వెళ్లిపోతుంటాయి. అలాంటిది వికెట్లని కనీసం చూడకుండానే.. వెనక్కి బంతిని విసిరి రనౌట్‌ చేయడం ధోనికే సాధ్యం. మాహీ మ్యాజిక్ చూశారా అంటూ బీసీసీఐ  ట్విట్టర్లో లింక్ ట్వీట్ చేసింది.

కాగా, నిన్న జరిగిన వన్డేలో భారత జట్టుపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌పై 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 48.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఈ నెల 29న విశాఖలో చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది.

- Advertisement -