ఆరోగ్యశాఖ అధికారులతో కేటీఆర్ సమీక్ష..

139
- Advertisement -

జిహెచ్ఎంసి ‌పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మరియు విపత్తు నిర్వహణ అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పలుచోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని మంత్రికి సీఎస్ సోమేష్ కుమార్ తెలియజేశారు. ప్రభుత్వం నగర ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నీళ్లు వెళ్లిపోయిన కాలనీలు, ఇళ్లలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి నిర్ణయించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి, సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాలనీల్లో జీహెచ్ఎంసి సెంటర్లలో 104 వాహనాల ద్వారా తక్షణం వైద్య సహాయం అందించాలని ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావం నుంచి బయటకు వచ్చిన ప్రజలు, తాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు మంత్రి కేటీఆర్.

నిన్నటి నుంచి నగర వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశామని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా ప్రజలకి అక్షయపాత్ర సహాయంతో 5 రూపాయల భోజనం మరియు ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో వరద ప్రభావం అంచనా వేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసి కలిసి పనిచేయాలని మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రితో జరిగే సమావేశ సమయానికి అన్ని వివరాలతో కూడిన నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

పాతభవనాలు, అపార్టుమెంట్ సెల్లార్లు, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నీటిని   తొలగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద ముందస్తు చర్యలకు సాగునీటి శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశం.  హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాలవల్ల ఎదురైన పరిస్థితుల పైన సమీక్షించేందుకు వీలుగా CDMA పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి ఒక నివేదిక సమర్పించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

- Advertisement -