మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక నటన వైపుకు వచ్చేసి చాలా కాలమే అయింది. ఒక వైపున సొంత బ్యానర్లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ .. నటిస్తూ, మరో వైపున సినిమాలపై దృష్టి పెట్టింది. తనకి నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ‘ఒక మనసు’ .. ‘హ్యాపీ వెడ్డింగ్’ .. ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలు ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి.
అంతేకాదు నిహారిక సినిమాల్లోకి వస్తున్నప్పుడే చాలా మంది మెగాఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. దీనికి తోడు ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా హిట్ కాకుండా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం కావడంతో నిహారిక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నటనకు స్వస్తి చెప్పి.. నిర్మాతగా మారనుందట నిహారిక.
ఇప్పటికే వెబ్ సిరిస్ నిర్మాణం కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిహారిక.. ఇకపై అదే బ్యానర్‌పై సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటోందనేది ఫిలిం నగర్ టాక్. అంతేకాకుండా మెగా హీరోతోనే నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ప్రారంభించాలనేది అమ్మడి ఆలోచనట. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. నిహారిక నుంచే ఓ అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచిచూడాల్సిందే మరి.