జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చామన్నారు. ప్రస్తుతం దేశంలో 5 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్ మహమ్మారిపై దేశ పోరాటాన్ని మరింత ముందుకు వెళ్లనున్నట్లు మాన్సుఖ్ మాండివియా తెలిపారు.
కాగా, ఆగస్టు 5వ తేదీన సింగిల్ డోసు అప్రూవల్ కోసం జాన్సన్ కంపెనీ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో జాన్సన్ కంపెనీ ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నది. సింగిల్ షాట్ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను 85 శాతం సమర్థవంతంగా నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌తో జాన్సన్ టీకా సామర్థ్యం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత ఆ టీకా ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.