ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట…!

150
congress
- Advertisement -

ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓ పక్క జగ్గారెడ్డి రాజీనామా ఉదంతంతో పాటు..కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది త్వరలో టీఆర్ఎస్ గూటికి చేరుతారనే వార్తలతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి టెన్షన్ పట్టుకుంది.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు రెండు, మూడు వర్గాలుగా చీలిపోయి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ మాదంటే మాదని తమలో తాము కొట్టుకుంటూ పార్టీ పరువు తీస్తున్నరు. తాజాగా హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు మధ్య వర్గ విబేధాలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం..ఇప్పుడు నాయకత్వలేమితో సతమతమవుతోంది. ఒకప్పుడు మాజీ మంత్రి, దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి హయాంలో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది.

మాజీమంత్రి దానం నాగేందర్.. కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ బలంగా ఉనికి చాటుకుంటూ వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్‌ను వీడిన దానం అధికార టీఆర్ఎస్‌లో చేరారు. ఆ వెంటనే జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని దానం వీడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో 2018 ముందస్తు ఎన్నికల్లో అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్‌కి టికెట్ ఇచ్చారు. నిజానికి ఖైరతాబాద్‌లో పోటీ చేయడం దాసోజుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. ఆఖరి నిముషంలో టికెట్ దక్కడంతో బరిలోకి దిగాల్సి వచ్చింది. పాపం దాసోజుకు ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన లేదు. ఎలాగోలా ప్రచారంలో దిగి పోరాటం చేసినప్పటికీ, దానం నాగేందర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఆ నిజయోజక వర్గాన్ని దాసోజు అంటిపట్టుకుని ఉన్నప్పటికీ, అక్కడ కనీస స్థాయిలో కూడా బలోపేతం చేయలేకపోయారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో స్థానికుడైన డాక్టర్ రోహిన్‌రెడ్డి పేరు సడన్‌గా తెర మీదికి వచ్చింది. రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న రోహిన్ రెడ్డి వచ్చేసారి తనకే టికెట్ అంటున్నారు. నిజయోజకవర్గంలో స్థానికుడినైనా దానం నాగందర్ పార్టీలో సీనియర్‌గా ఉన్నారు. కాబట్టి అప్పట్లో నాకు టికెట్ దక్కలేదు….2018 లో నాకు టికెట్ దక్కాల్సి ఉన్నపటికీ ఉత్తమ్ కుమార్.. సపోర్ట్ చేయకపోవడంతో టికెట్ దక్కలేదని రోహిన్ రెడ్డి చెప్తున్నారు. తనకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని, అంతేకాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాకు సన్నిహితుడు కాబట్టి ఈసారి టికెట్ పక్కా నాకే అని రోహిన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. రోహిన్ రెడ్డి ఎంట్రీతో దాసోజు శ్రవణ్ ఇరకాటంలొ పడ్డారు. ఖైరతాబాద్‌లో రోహిన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై దాసోజు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టికెట్ కోసం దాసోజు, రోహిన్ రెడ్డిల మధ్య ఫైట్ నడుస్తుంటే.. అదే నియోజక ర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సైతం తానూ టికెట్ రేసులో ఉన్నఅంటూ చెప్పుకుంటున్నారు. మహిళల కోటాలో ఈ సారి ఖైరతాబాద్ టికెట్ తనదే అనే ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఖైరతాబాద్ కాంగ్రెస్‌ మూడువర్గాలుగా చీలిపోయి..ఇంకా ఎన్నికలు రాకముందే మాకంటే మాకు టికెట్ అని ఇప్పటినుంచే కొట్టుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నరు. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా..మరో రెండు వర్గాలు పార్టీ అభ్యర్థిని ఓడించడం ఖాయం..దీంతో మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు పక్కా అని టాక్ ఖైరతాబాద్‌లో టాక్ నడుస్తోంది. .మొత్తంగా ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో జరుగుతున్న మూడుముక్కలాట…టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పేద్ద తంటాగా మారిందనే చెప్పాలి.

- Advertisement -