సర్జికల్‌ స్టైయిక్స్‌..హైదరాబాదీ పైలట్‌

260
surgical strikes
- Advertisement -

సర్జికల్‌ స్ట్రైయిక్స్‌తో పాక్‌ వెన్నులో వణకుపుట్టించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. పుల్వామా దాడి తర్వాత ప్రతీకారేచ్ఛగా భారత్ జరిపిన వైమానికా దాడులను యావత్తూ దేశం ప్రశంసిస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసిన వైమానిక దళం..ముష్కరులపై కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడిలో దాదాపుగా 30 మందికిపైగా ఉగ్రవాదులు మట్టికరిచారు.

దాదాపు 12 అత్యాధునిక యుద్ధవిమానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాల్పులు జరిపి విజయవంతంగా వెనక్కితిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో పైలట్లకు భారతావని సెల్యూట్ చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరు ఈ వీర పైలట్ల సాహసాన్ని కొనియాడుతున్నారు. ఇక ఈ యుద్ధవిమానాలు నడిపిన వారిలో హైదరాబాద్‌ పైలట్ ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు నిరాకరించారు. దాడుల్లో పాల్గొన్న సైనికులు, పైలట్ల వివరాలు బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించవని వారు తెలిపారు. పైలట్లతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నామని వివరించారు.

ఇక పాక్‌పై సర్జికల్ అటాక్స్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ తర్వాత అత్యధిక సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నది హైదరాబాద్‌లోనే కావడంతో డీఆర్‌డీవో ప్రయోగశాలలు, రక్షణోత్పత్తుల పరిశ్రమలు, నగరం చుట్టుపక్కల ఉన్న సైనిక, వాయుసేన శిబిరాల్లో భద్రతను
కట్టుదిట్టం చేశారు.

- Advertisement -