భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం రికార్డును ప్రస్తుత జట్టు సమం చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా విదర్భ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 166 పరుగులకే చాపచుట్టేడంతో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
405 పరుగులు భారీ ఆధిక్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక ఆ టార్గెట్‌ని చేరుకోవడంలో విఫలమైంది. భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌మెన్లు కుప్పకూలారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ అద్వితీయ డబుల్ సెంచరీ, బ్యాట్స్‌మెన్లు పుజారా, విజయ్, రోహిత్‌ల శతకాలతో భారత్ 405 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
నాలుగో రోజు 21/1 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన లంక ఆటగాళ్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. బ్యాట్స్‌మెన్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అందరిని పెవిలియన్ బాటపట్టించారు. ఒక దశలో లంక కెప్టెన్ చండీమాల్(61) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక 49.3 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. భారత బౌలింగ్‌లో అశ్విన్ 4, జడేజా, ఇషాంత్, ఉమేష్ తలో రెండో వికెట్లు తీశారు.