హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

197
rains
- Advertisement -

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్నిరోజులుగా నగరాన్ని వీడని భారీ వర్షాలు ఈ మధ్యాహ్నం కూడా పలకరించాయి. బంగాళాఖాతంలో ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నగరంలో అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండ‌పోత వాన‌కు రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.

భారీ వాన‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం 100కు డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.

దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కుషాయిగూడ, మల్కాజ్ గిరి, తార్నాక, ఓయూ క్యాంపస్, సైనిక్ పురి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గోల్కొండ, చాంద్రాయణగుట్ట, కాప్రా, ఫలక్ నుమా, చార్మినార్, మెహదీపట్నం, అంబర్ పేట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నగరంలో పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగా కారుమబ్బులు కమ్ముకోవడంతో హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వరదలతో భీతిల్లిన ప్రజలు, చినుకురాలితే చాలు హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

- Advertisement -