పోలీస్ కస్టడీలో సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి

233
srinivas reddy

నల్గొండ కోర్టు ఉత్తర్వుల మేరకు సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని యాదాద్రి భువనగిరి పోలీసుల కస్టడీకి అప్పగించారు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు. వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాస్‌ రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు కేసులో మరింత పురోగతిని సాధించనున్నారు.

ఫేస్‌బుక్‌ స్నేహితులు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అమ్మాయిలతో అతడికున్న పరిచయాలు తదితర విషయాలపై ఆరా తీయనున్నారు.దీంతో పాటు శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలిగా భావిస్తున్న యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఆమె ఆచూకీ ఇంతవరకు లభించకపోవడం, వేములవాడలోని అగ్రహారం గుట్టల్లో ఓ యువతి డెడ్‌బాడీని పోలీసులు కనుక్కున్నారు. దీంతో ఆమె శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఆమెను కూడా శ్రీనివాస్‌ రెడ్డి చంపాడా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అలాగే బొమ్మలరామారం పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీలో శ్రీనివాస్‌ రెడ్డి నుండి నిజాలను రాబట్టనున్నారు. 2015లో 6వ తరగతి విద్యార్థిని కల్పనపై అత్యాచారం చేసి హత్యచేశాడు ఈ మానవమృగం. అదే ఏడాది మైసిరెడ్డిపల్లి గ్రామంలో వివాహితపై అత్యాచార యత్నానికి ప్రయత్నించి గ్రామస్తుల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. తర్వాత 2016లో కర్నూలులో ఓ మహిళను, 2019 మార్చిలో డిగ్రీ విద్యార్థిని మనీషా, 2019 ఏప్రిల్‌లో 9వ తరగతి విద్యార్థిని శ్రావణిలను అత్యాచారం చేసి హతమార్చాడు.