నారాయణపేట మండలాన్ని కొనసీమగా మారుస్తానని స్పష్టం చేశారు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నారాయణపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన హరీష్ 30 ఏండ్ల కల నారయణపేటను మండలంగా చేసుకున్నామని చెప్పారు.
జూన్ మొదట వారంలో ఈ మండలం లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించి…అతి త్వరలో నూతన భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఈ మండలానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చి ఆదర్శ మండలంగా తయారు చేస్తానని వెల్లడించారు.
వచ్చే నెల నుండి పెంచిన ఫించన్లను అందిస్తామని తెలిపారు. ఏడాదిలో హైదరాబాద్ నుండి సిద్దిపేటకు రైలు వస్తుందని తెలిపారు. ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. 500 పడకల మెడికల్ కాలేజ్ నిర్మించి, రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
నారాయణ పేట మండలానికి 5వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన హరీష్ – దసరా నాటికి గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. మత్తడి దుంకుతుంటే బతుకమ్మ లు వేసే రోజులు,చెద బావుల్లో చెంబులతో నీళ్లు ముంచుకొనే రోజులు దగ్గర లొనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు రావాలంటే జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.