కేబినెట్ విస్తరణ… ఆ ఆరుగురు వీరేనా…!

285
cabinet expansion

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిస్ధాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని లీకులు వెలువడుతున్న నేపథ్యంలో కేబినెట్‌లో చోటు దక్కించుకునేది ఎవరా అనేదానిపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి.

ఇప్పటివరకు మంత్రివర్గంలో 11 మంది ఉండగా మరో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నవారిలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీలు ముగ్గురు,ఎస్సీ, మైనారిటీ, వెలమ వర్గాల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కరీంనగర్‌ నుండి ఈటల , కేటీఆర్‌ మంత్రులుగా పనిచేశారు. అయితే తదుపరి విస్తరణలో కేటీఆర్‌కు కచ్చితంగా చోటుదక్కే అవకాశం ఉంది.

నల్గొండ జిల్లా నుండి ప్రస్తుతం జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉండగా గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డి, ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు అవకాశం దక్కనుంది. మెదక్‌ జిల్లా నుండి హరీష్‌కు ఈ సారి ఛాన్స్ దక్కడం ఖాయమేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు ప్రాతినధ్యం దక్కలేదు కాబట్టి కాంగ్రెస్ నుండి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు మంత్రిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల సమీకరణాల ఆధారంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒక సీనియర్‌ మంత్రిని తొలగించి అదే జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ కీలక నేతకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా కేబినెట్ విస్తరణ త్వరలో జరగనుందనే వార్త పొలిటికల్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.