దీదీ….లేడీ గాంధీ

198
hardik patel meets west bengal chief minister mamata
- Advertisement -

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన కార్ల తయారీ యూనిట్ ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ కు తరలించిన వైనం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నట్టుంది. అందుకేనేమో రాజకీయ వైరంతో ప్రధాని నరేంద్ర మోడీతో ఢీకొడుతున్న దీదీ, గుజరాత్ పైనా అవకాశం చిక్కినప్పుడల్లా ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అంతేగాదు గుజరాత్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత, యువ సంచలనం హార్దిక్ పటేల్ కు దీదీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ శుక్రవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా తృణమూల్ పార్టీ చీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు నేను ‘లేడీ గాంధీ’, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిని కలిశా అని హార్దిక్ ట్వీట్ చేశారు. ప్రజల కోసం అలుపెరగకుండా పోరాడుతున్న ఆమె ఇందిరాగాంధీ అంతటి స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.

మమతాను హార్దిక్ కలవడం ఇదే తొలిసారి. మమతాబెనర్జీతో దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి ఎంతో సాదాసీదాగా ఉంటారని, ఆమె సింప్లిసిటీ, నిస్వార్థ స్వభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మమతా చాలా తెలివైన నాయకురాలని పేర్కొన్న హార్దిక్ విప్లవాత్మక నాయకురాలని కొనియాడారు. ఇక, హార్దిక్ పటేల్‌ను మమతా బెనర్జీ తన చిన్న తమ్ముడని అభివర్ణించారు.

- Advertisement -