హ్యాపీ బర్త్ డే…రమ్యకృష్ణ

202
ramya krishna
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రమ్యకృష్ణ.అందమైన ప్రియురాలిగా, పవిత్రమైన ఇల్లాలిగా, పొగరుబోతు అమ్మాయిగా విభిన్న పాత్రల్లో నటించి నట విశ్వరూపం చూపించింది. అద్భుతమైన హావభావాలతో నవరస’రమ్య’భరితంగా నవరసాలకే వన్నె తెచ్చి తనకి తానే సాటనిపించుకుంది. అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడి వారికి ధీటుగా మెప్పించిన రమ్యకృష్ణ పుట్టిన రోజు నేడు.

రమ్యకృష్ణ … తెలుగు తెరపై కనువిందైన సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందాల కథానాయిక. ప్రారంభంలో గ్లామర్ ని మాత్రమే నమ్ముకున్నా, ఆ తరువాత అసమానమైన అభినయాన్ని ప్రదర్శించిన అరుదైన నాయిక. పాత్ర స్వరూప స్వభావాలు మరిచిపోకుండా ఇటు మాస్ ఆడియన్సును … అటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. కెరియరు ప్రారంభంలో తనది ఐరెన్ లెగ్ అని పక్కన పెట్టిన వారితోనే, గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఏకైక కథానాయిక ఆమె. 1967 సెప్టెంబరు 15 న జన్మించిన రమ్యకృష్ణ, 13 వ ఏటనే అభినయం దిశగా అడుగులు వేసింది.

1980 ప్రధమార్ధంలో ‘భలే మిత్రులు’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన రమ్యకృష్ణని కాలం వెంటనే కనికరించలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో కొనసాగుతోన్న ఆమె కెరియరుకు ‘సూత్రధారులు’ చిత్రం ఆశాకిరణమై నిలిచింది … ఆమెలోని నటిని చాలా చక్కగా ఆవిష్కరించింది. ఈ సినిమాతో ఆమె ఇటు పరిశ్రమ దృష్టిని … అటు ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన ‘అల్లుడుగారు’ చిత్రం ఆమెకి తొలి ఘన విజయాన్ని అందించింది. ఈ సినిమాలో అదరహో అనిపించే ఆమె అందం … అభినయం చూసిన ప్రేక్షకులు, దేనికి ఎక్కువ మార్కులు వేయాలో తెలియక తికమక పడ్డారు. ఇక ఈ సినిమా నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ‘అల్లరి మొగుడు’ … ‘బృందావనం’ … ‘అల్లరి అల్లుడు ‘ … ‘అల్లరి ప్రియుడు’ … ‘ముగ్గురుమోనగాల్లు’ … ‘బంగారు బుల్లోడు’ … ‘హలో బ్రదర్’ … ‘అమ్మోరు’ … ‘అన్నమయ్య’ వంటి చిత్రాలతో అఖండ విజయాలను అందుకుంటూ వెళ్లింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటించింది.

‘అల్లుడుగారు’ విజయం రమ్యకృష్ణలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత వచ్చిన ఇద్దరూ ఇద్దరే.. అల్లరి మొగుడు.. బలరామకృష్ణులు.. మేజర్‌ చంద్రకాంత్‌.. బంగారు బుల్లోడు.. అల్లరిప్రియుడు.. ముగ్గురు మొనగాళ్లు.. ముద్దుల ప్రియుడు.. హలోబ్రదర్‌.. క్రిమినల్‌.. తదితర చిత్రాలు రమ్యకృష్ణను స్టార్‌ కథానాయికగా నిలబెట్టాయి. పలు చిత్రాల్లో ఆమె పోషించిన గ్లామర్‌ పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కథానాయికలను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడిది అందెవేసిన చేయి. వెండితెరపై శ్రీదేవి తర్వాత అంత అందంగా రమ్యకృష్ణను చూపించేవారని చెబుతారు. కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనూ రమ్యకృష్ణ పోషించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘కంటే కూతుర్నే కను’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.

అటు గ్లామర్‌ క్వీన్‌గా, ఇటు భక్తిరస చిత్రాలతోనూ రమ్యకృష్ణ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు.బాహుబలిలో రాజమాతగా ఆమె పర్‌ఫామెన్స్‌ అందన్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగు,తమిళ ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది రమ్యకృష్ణ. ఆమె ఇలానే ప్రేక్షకులు మెచ్చే మరిన్ని పాత్రలు చేయాలని కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్‌ తరుపున మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -