యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ ప్రారంభమైంది. ఆలయ ఉద్ఘాటనలో భాగంగా రెండో రోజు(మంగళవారం) ఇవాళ శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన,ద్వారా తోరణ ధ్వజ కుంభారాధనలు, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఇక గోదావరి నీళ్లతో యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. దీంతో గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి.
యాదగిరిగుట్టలోని స్థానిక గండిచెరువుకు చేరిన గోదావరి జలాలు అక్కడి నుంచి కొండ కింద ఉన్న లక్ష్మి పుష్కరిణికి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు తరలిస్తారు. ఇకపై నిత్యం గోదారి జలాలతో స్వామివారికి అభిషేకం చేయనున్నారు.