వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms No.74ను విడుదల చేసింది. వరంగల్, నర్సంపేట (2) రెవెన్యూ డివిజన్లు, 1805.37 చ.కిమీ వైశాల్యంతో, 8,93,715 మంది జనాభాతో వరంగల్ జిల్లాగా, హనుమకొండ, పరకాల (2) రెవెన్యూ డివిజన్లు, 1688.75 చ.కిమీ వైశాల్యంతో 9,05,744 మంది జనాభాతో హనుమకొండ జిల్లాగా నిర్మించడం జరిగింది.
జిల్లాల పేర్లు మార్చుతూ, మండలాల మార్పు, చేర్పులపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిపాధనలపై ఇరు జిల్లాల ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. ఇరు జిల్లాల్లోని ప్రజల నుండి 133 సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల నుంచి అభ్యంతరాలపై బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, స్టే.ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ అర్భన్ జిల్లా పరిషత్ చైర్మన్ డా.సుధీర్‌కుమార్, వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాల కలెక్టర్‌లు రాజీవ్‌గాంధి హనుమంతు, హరితలతో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హనుమకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమధేవరపల్లి, కమలాపురం, పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట (14) మండలాలను కలుపుతూ హనుమకొండ జిల్లా గాను, వరంగల్, ఖిలావరంగల్, సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ (13) మండలాలను కలుపుతూ వరంగల్ జిల్లాను ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వం తుది జివోను విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు, కాకతీయుల పాలనతో వరంగల్, హనుమకొండకు ఉన్న ప్రాశస్థ్యాన్నిభవిష్యత్ తరాలకు అందించేందుకు చిరకాలం నిలిచిపోయే విధంగా ఉండేందుకు ప్రభుత్వం వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను మార్చి వరంగల్, హనుమకొండ జిల్లాలుగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకోని జీవో విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ లు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇరు జిల్లాల్లో సంబరాలు జరుపుకున్నారు. సుభేదారిలోని హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆద్వర్యంలో జరిగిన సంబరాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని సియం కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.