వ‌రంగ‌ల్- హ‌న్మ‌కొండ‌ జిల్లాలుగా జీవో జారీ చేసిన ప్రభుత్వం..

174
telangana
- Advertisement -

వ‌రంగ‌ల్ రూర‌ల్‌, వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లాల‌ను వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌ జిల్లాలుగా మార్చుతూ గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీంతో వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

తాజా మార్పుతో జిల్లాల స్వ‌రూపం :

హన్మకొండ జిల్లా : 12 మండ‌లాల‌తో హ‌న్మ‌కొండ జిల్లా, 15 మండ‌లాల‌తో వ‌రంగ‌ల్ జిల్లాను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. హ‌న్మ‌కొండ జిల్లాలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లుస్తుండ‌గా, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన ధ‌ర్మ‌సాగ‌ర్‌, వేలేరు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ర‌కాల‌, నడికుడ‌, దామెర మండ‌లాలు, హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, ఎల్క‌తుర్తి మండ‌లాలు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌మాలాపూర్ క‌లిశాయి. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లాలు కూడా హ‌న్మ‌కొండ జిల్లాలోనే ఉన్నాయి.

వ‌రంగ‌ల్ జిల్లా : వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌స్తుత వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఉంటుంది. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట, సంగెం మండ‌లాలు, వ‌ర్ధ‌న్న‌పేట నియోజక‌వ‌ర్గం నుంచి వ‌ర్ధ‌న్న‌పేట‌, ప‌ర్వ‌త‌గిరి, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాయ‌ప‌ర్తి, న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాలు న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్నాయి. వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌రంగ‌ల్‌, ప‌ర‌కాల రెవెన్యూ డివిజ‌న్లు ఉన్నాయి. కొత్త‌గా క‌మాలాపూర్ మండ‌లం ప‌ర‌కాల ప‌రిధిలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాల స‌మ్మిళితంతో హ‌న్మ‌కొండ జిల్లా అవ‌త‌రించింది. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ్మిళితంతో, రెండు రెవెన్యూ డివిజ‌న్లు (వ‌రంగ‌ల్‌, న‌ర్సంపేట)తో వ‌రంగ‌ల్ జిల్లా అవ‌త‌రించింది.

హ‌న్మ‌కొండ జిల్లాలోని మండ‌లాలు: హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌.

వ‌రంగ‌ల్ జిల్లాలోని మండ‌లాలు: వ‌రంగ‌ల్‌, ఖిలావ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌.

- Advertisement -