“పెళ్ళిచూపులు” విడుదలై చాలా రోజులవుతోంది. ఆ సినిమాకి ఆ స్థాయి విజయం, ప్రశంసలు అనేవి అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆ స్థాయి సినిమాతో మీముందుకు రావడం కోసం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో సక్సెస్ ఫుల్ సినిమా అనేదానికి కొలమానం లేదనే విషయం తెలుసుకొన్నాను. నేను ప్రేమించే పనిని బాధ్యతతో, నిజాయితీతో నిర్వర్తించానా లేదా అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అని గ్రహించాను. అందుకే మళ్ళీ మీ ముందుకు మరో ప్రయత్నంతో వస్తున్నాను.
నా తదుపరి చిత్రం ఓ నలుగురు మిత్రుల గురించి. కార్తీక్ (సుశాంత్ రెడ్డి), ఎలైట్ పబ్ లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ.. ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం పూర్. వివేక్ (విశ్వక్సేన్ నాయుడు) మన కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్, మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉప్పు (వెంకటేష్ కాకమాను) ఓ వెడ్డింగ్ ఫిలిమ్ ఎడిటర్, బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్ వెర్షన్ 2.0 (అభినవ్ గోమటం). వీళ్ళతోపాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే ఈ చిత్రానికి “నగరానికి ఏమైంది” అనే టైటిల్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యామ్. ఆ టైటిల్ సజెస్ట్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ & కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి. ఇక మమ్మల్ని గైడ్ చేసే బాధ్యతను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారు తీసుకొన్నాను. మా ప్రొడక్షన్ డిజైనర్ (ఆర్ట్ & కాస్ట్యూమ్స్) శ్రీమతి లత తరుణ్ ఈ సినిమా కోసం ఫెంటాస్టిక్ వర్క్ చేసిందని చెప్పాలి ఎందుకంటే ఆమె నా భార్య కాబట్టి. ఈ సినిమాతో నాకు నికేట్ బొమ్మిరెడ్డి అనే ఎక్స్ లెంట్ & టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ స్నేహితుడిగా దొరికాడు. భవిష్యత్ లో అతను ఇండస్ట్రీకి పెద్ద ఎస్సెట్ అవుతాడు. ఇక మా స్వర స్వేగర్ (అలా పిలవడం అతనికి ఇష్టం ఉండదు కానీ..) మిస్టర్.వివేక్ సాగర్ ఈ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు. మా ఎడిటర్ రవితేజ గిరిజాల అయితే నేను గనుక ఇంకోక్క ఎడిట్ ఛేంజ్ అడిగానంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడేమో. మా కూలెస్ట్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు గారు.
నేను నా జీవితంలో అమితంగా వేల్యూ ఇచ్చేది, నమ్మేది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. నా స్నేహితులతో నేను చేసిన పాయింట్ లెస్ కన్వర్జేషన్స్, క్రేజీ ట్రిప్స్, సిల్లీ షార్ట్ ఫిలిమ్స్ నన్ను ఒక బెటర్ పర్సన్ గా తీర్చిదిద్దడంతోపాటు నా జీవితాన్ని మరింత ఆనందంతో నింపాయి. ఆ మెమరబుల్ మూమెంట్స్ అన్నిట్నీ క్యాప్చ్యూర్ చేసి వీలైనంత హ్యూమర్ తో ఈ సినిమాను తెరకెక్కించాను, నమ్మండి ఈ లెటర్ కంటే కూడా సరదాగా ఉంటుంది నా సినిమా, ప్రామిస్. సో, చిన్న సినిమా, కొత్త మొహాలు, మా క్రేజీ గ్యాంగ్ తెరకెక్కించిన మా సినిమా చూడడం కోసం మీ క్రేజీ గ్యాంగ్స్ తో కలిసి థియేటర్స్ కి రండి. చూసుకుందాం!
మీ
తరుణ్ భాస్కర్ దాస్యం